
వాషింగ్టన్: జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి మరో సంచలన విషయం బయట పడింది. హౌస్ ఓవర్ సైట్అండ్ గవర్నమెంట్ రిఫార్మ్ కమిటీతో పాటు డెమోక్రాట్లు కూడా విడుదల చేసిన ఆ ఫైల్స్‌లో టెస్లా చీఫ్‌ఎలాన్ మస్క్ పేరు ఉండడం కలకలం రేపుతోంది. చిన్నపిల్లలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన ఎప్ స్టీన్ ప్రైవేట్ ఐలాండ్‌లో మస్క్ 2014లో పర్యటించారని ఆ ఫైల్స్‌లో ఆరోపణలు వచ్చాయి. మస్క్‌తో పాటు పలువురి ప్రముఖుల పేర్లు కూడా ఆ ఫైల్స్‌లో ఉన్నాయి.
అమెరికా ఆంత్రప్రెన్యూర్ పీటర్ థీల్, వైట్ హౌస్ మాజీ చీఫ్స్ట్రాటజిస్ట్ స్టీవ్ బానన్, ప్రిన్స్ ఆండ్ర్యూ, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్లను ఎప్ స్టీన్ ఫైల్స్‌లో చేర్చారు. 2014 డిసెంబరు 6న ఎప్ స్టీన్ ప్రైవేటు ద్వీపంలో మస్క్ పర్యటనను షెడ్యూల్ చేశారని ఆ ఫైల్స్‌లో వెల్లడించారు. కాగా.. తన పేరును ఎప్ స్టీన్ ఫైల్స్‌లో చేర్చడంపై మస్క్ స్పందించారు.
డెమోక్రాట్లు, వారి మిత్రపక్షాలు తనను చూసి భయపడుతున్నాయని ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. వారు చెబుతున్నదంతా అబద్ధమన్నారు. ‘‘అవినీతిపరులను నేను బట్టబయలు చేస్తాను. నా సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం ఇస్తున్నా. దీంతో వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు” అని మస్క్ చెప్పారు.
ఎప్ స్టీన్ ఫైల్స్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉందని, కానీ ఆయన పేరును బయటపెట్టడం లేదని మస్క్ గతంలో ఆరోపించారు. మరోవైపు ఎస్ స్టీన్ ఫైల్స్ ను డెమోక్రాట్లు ఏకపక్షంగా విడుదల చేస్తున్నారని రిపబ్లికన్లు మండిపడుతున్నారు. రాజకీయ కక్షతోనే వారు అలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.