థర్డ్ వేవ్ కు రెడీ కావాలి:  కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

థర్డ్ వేవ్ కు రెడీ కావాలి:   కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

థర్డ్ వేవ్ లోకి మనం ఎప్పుడైనా ఎంటర్ కావచ్చు. ఇప్పుడే ప్రిపేర్ అయితే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలం. థర్డ్ వేవ్ పిల్లలకు చాలా ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా బఫర్ స్టాక్ పై దృష్టి పెట్టాలి.  ఆక్సిజన్​ కేటాయింపుల ఫార్ములా మార్చాల్సిన అవసరం  ఉంది. ‑ సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్​పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ముఖ్యంగా పిల్లలకు చాలా ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెప్పారని, ఈ ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రెడీగా ఉండాలని  కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ కొరత రాకుండా బఫర్ స్టాక్ పై దృష్టి పెట్టాలని చెప్పింది. 'థర్డ్ వేవ్ లోకి మనం ఎప్పుడైనా ఎంటర్ కావచ్చు. ఇప్పుడే ప్రిపేర్ అయితే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలం' అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన బెంచ్  చెప్పింది. ఢిల్లీకి ఆక్సిజన్ సప్లయ్​పై దాఖలైన పిటిషన్​పై గురువారం విచారణ సందర్భంగా బెంచ్ ఈ కామెంట్స్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఢిల్లీకి కేటాయించిన ఆక్సిజన్ ను సప్లయ్ చేయడంలో కేంద్రం ఫెయిలైందని సీనియర్ అడ్వొకేట్ రాహుల్ మెహ్రా బెంచ్​కు చెప్పారు. మధ్యప్రదేశ్, పంజాబ్​లాంటి రాష్ట్రాలకు అడిగినదానికంటే ఎక్కువ ఆక్సిజన్ సప్లయ్ చేశామని అఫిడవిట్లు ఫైల్ చేస్తూ.. తప్పుదోవ పట్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిమాండ్ కన్నా ఎక్కువ ఆక్సిజన్ సప్లయ్ చేస్తున్నామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఢిల్లీలోని 56 మేజర్ హాస్పిటళ్లలో మే 4న సర్వే చేశామని, పెద్దఎత్తున లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ స్టాక్ ఉన్నట్టు తేలిందన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ల అన్ లోడింగ్​లో జాప్యం జరుగుతోందన్నారు. కేవలం ఢిల్లీకి మాత్రమే 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇస్తే..  ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇద్దరి వాదనలపై స్పందించిన బెంచ్... ఆక్సిజన్ కేటాయింపుల ఫార్ములాను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ఆడిట్ చేయాలంది.  ఢిల్లీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కరోనా బారిన పడిన జనం మరణిస్తున్నారని. అందులో ఎక్కువమంది ఆక్సిజన్ కొరత వల్లే చనిపోతున్నారని పేర్కొంది. ఆక్సిజన్ సప్లయ్​పై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ పరస్పరం నిందించుకోవడం మానుకోవాలని బెంచ్ సూచించింది.