గ్రామ పంచాయతీల్లో బాండ్లు, సాదాబైనామాలతో మ్యుటేషన్లు బంద్

గ్రామ పంచాయతీల్లో బాండ్లు, సాదాబైనామాలతో మ్యుటేషన్లు బంద్

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నాన్‌‌ అగ్రికల్చర్‌‌ ల్యాండ్స్‌‌కు రిజిస్ట్రేషన్‌‌ తప్పనిసరి కానుంది. గతంలో లాగా తెల్లకాగితాలపైనో (సాదాబైనామాలు), బాండ్​పేపర్లపైనో క్రయవిక్రయాల ఒప్పందాలు చేసుకుని, పంచాయతీ రికార్డుల్లో పేరు మార్చుకోవడానికి చాన్స్​ ఉండదు. ఈ మేరకు సర్కారు పంచాయతీరాజ్​ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. ఇకపై ఇండ్లు, వ్యవసాయేతర భూముల కొనుగోలు, గిఫ్ట్‌‌ డీడ్‌‌లకు రిజిస్ట్రేషన్‌‌ తోపాటు వెంటనే మ్యుటేషన్‌‌  చేస్తామని పేర్కొంది. ఇప్పటివరకు పంచాయతీ సెక్రెటరీలకు ఉన్న ఈ మ్యుటేషన్ పవర్​ను సబ్‌‌ రిజిస్ట్రార్లకు కట్టబెట్టింది.

ఆన్​లైన్లోనే..

రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో వ్యవసాయ భూములు మినహా ఏ రకమైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినా సమీపంలోని సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌‌ చేయించుకోవాలి. కేవలం ఆస్తుల అమ్మకాలే కాదు వారసత్వ బదలాయింపులు, గిఫ్ట్‌‌ డీడ్‌‌లకూ ఇది వర్తిస్తుంది. ఇందుకు నిర్దేశిత ఫీజు చెల్లించాలి. మ్యుటేషన్‌‌ కోసం గ్రామ పంచాయతీతోపాటు సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌‌ కూడా జత చేయాలి. సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ధరణి పోర్టల్‌‌ ద్వారా ఆన్‌‌లైన్‌‌లోనే మ్యుటేషన్‌‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను గుర్తింపు నంబర్‌‌ను సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ లే కేటాయిస్తారని సర్కారు పేర్కొంది. కానీ గ్రామ పంచాయతీల్లో నంబర్‌‌ కేటాయింపుపై స్పష్టత లేదు. ఆన్‌‌లైన్‌‌లో మ్యుటేషన్‌‌ అయినా ఇంటి నంబర్‌‌ కేటాయింపు కోసం పంచాయతీ సెక్రెటరీ దగ్గరకు వెళ్లక తప్పదని అధికారులు చెప్తున్నారు.