
మందేసి చిందేస్తే… బోనులోకి తోసి బొడ్రాయి కాడ నిలబెడ్తరు
గుజరాత్‌లో రెండు ఊళ్లలో కఠిన శిక్షలు
పరువు, సొమ్ము పోతుండటంతో తాగుడు మానేస్తున్న మందుబాబులు
ఆ ఊళ్లో ఎవరైనా తాగి కనిపిస్తే.. ఇక వాళ్ల పని అయిపోయినట్టే. అప్పటికప్పుడు 2 వేలు ఫైన్ కట్టాల్సిందే. మత్తులో లొల్లి చేస్తే 5 వేలు కక్కాల్సిందే. అంతేకాదు.. ఫైన్ కట్టినంక ఊరోళ్లందరికీ మటన్ కూరతో దావత్ కూడా ఇయ్యాలె! ఇసొంటిదే మరో ఊరు కూడా ఉంది. అక్కడ తాగినోళ్లను ఇనుపబోనులో పెట్టి బొడ్రాయి కాడ నిలబెడతరు. రూ. 1200 ఫైన్ కట్టినంకనే వదిలిపెడతరు! మందుబాబులతో ఈ అలవాటును మానిపించేందుకే గుజరాత్‌లోని రెండు గ్రామాల ప్రజలు ఇలా కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు.
కిక్కు కోసం తాగితే.. 25 వేల చిల్లు పడ్తది
అది బనస్కంద జిల్లాలోని ఖటిసితార గ్రామం. ఊళ్లో దాదాపు అందరూ గిరిజనులే ఉంటారు. మగాళ్లంతా తాగడం రోజూ తన్నుకోవడం జరిగేది. అప్పుడప్పుడు ఈ కొట్లాటలు మర్డర్ల దాకా పోయేవి. దీంతో ఊళ్లో ఈ పరిస్థితిని మార్చాలని గ్రామస్తులంతా 2013లో తీర్మానం చేసుకున్నారు. ఊళ్లో ఎవరైనా తాగితే రూ. 2 వేలు, తాగి లొల్లి చేస్తే 5 వేలు ఫైన్ వేయాలని నిర్ణయించారు. దీంతోపాటు ఊరందరికీ బోక్డు (మటన్ కర్రీ), బాటి (గోధుమ పిండిని కాల్చి చేసే ఉండలు)తో దావత్ ఇయ్యాలని డిసైడ్ చేశారు. ‘‘ఊళ్లో జనాభా దాదాపుగా 800 వరకూ ఉంటుంది. ఇక ఇంతమందికీ మటన్ దావత్ ఇయ్యాలంటే.. సుమారుగా 25 వేల వరకూ జేబులకు చిల్లు పడక తప్పదు. దీంతో ఊళ్లో క్రమంగా పరిస్థితి మారిపోయింది. మొదట్లో ఏడాదికి ముగ్గురు, నలుగురే తాగి పట్టుబడ్డారు. గత ఏడాది మాత్రం ఒక్కడే దొరికాడు. అది కూడా పొరుగూరికి చెందిన వ్యక్తి” అని గ్రామ సర్పంచ్ ఖిమ్జీ దంగైసా వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎవరూ తాగి కనిపించలేదన్నారు. ‘‘ఇక ఖటిసితార సమీపంలోని ఉపాలా అనే ఊళ్లో చుట్టాలొస్తే మందు దావత్ ఇయ్యడం ఆనవాయితీ. గుజరాత్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నందున పొరుగునున్న రాజస్తాన్ నుంచి మందు తెచ్చి మరీ దావత్ ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ఊళ్లోనూ మందు దావత్ లు తగ్గించుకున్నరు” అని ఖిమ్జీ తెలిపారు.
మందుబాబుల కోసం ‘మోతిపురా జైల్’
అది సనంద్ పట్టణానికి సమీపంలోని మోతిపురా గ్రామం. ఆ ఊళ్లో ఎవరైనా మందు తాగి దొరికిపోతే పట్టుకుని ఇనుప బోనులో వేస్తారు. ఆ బోనుకు చక్రాలుంటాయి. తోసుకుంటూ పోయి బొడ్రాయి కాడ నిలబెడతారు. ఇంక అందులో పడ్డోళ్ల పరువు ఊరందరి ముందు గంగలో కలవడం ఖాయం! దీంతో పాటు రూ. 1200 ఫైన్ కట్టినంకనే వాళ్లను బోను నుంచి వదులుతారు. ఇక మందుబాబులు బోనులో పడ్డా లొల్లి చేశారనుకోండి.. తీసుకెళ్లి రాత్రంతా ఊరవతల వదిలేసి వస్తారు! దీనిని లోకల్ జనాలు ‘మోతిపురా జైల్’గా పిలుస్తున్నారు. ఫైన్‌ల ద్వారా వచ్చిన సొమ్మును ఊళ్లో మంచి పనుల కోసం వాడతారు. ఆ ఊళ్లో దాదాపు 3500 మంది ఉంటున్నారు. అందరూ సంగీత పరికరాలు తయారు చేసి అమ్మేవాళ్లు లేదా కూలీలుగా పనిచేసేవాళ్లే. ఒకప్పుడు అక్కడ 80 శాతం మంది మగాళ్లు తాగేవారు. చాలామంది చిన్న వయసులోనే ఆరోగ్యం చెడిపోయి చనిపోయేవారు. 2016కు ముందు ఆ ఊళ్లో ఇలా దాదాపు 150 మంది భర్తలను పోగొట్టుకున్నారు. దీంతో 2016లో ఊరి పెద్దలంతా కదిలారు. ఎవరో ఒకరు ఈ జైలు ఐడియా ఇచ్చారు. ఇంకేం.. ఇప్పుడు ఈ జైల్గుర్తొస్తేనే మందుబాబులకు కిక్కు దిగిపోతోందట. ఇప్పటివరకు చాలా మంది తాగుడును వదిలేశారని, ఇంకా కొందరు దొంగచాటుగా తాగుతున్నారని గ్రామ సర్పంచ్ బాబూ నాయక్ చెప్పారు. గ్రామంలో 40 మంది యువకులతో ఓ కమిటీ వేశామని, వీళ్లు రోజూ రాత్రి 9కి ఇంటింటికీ వెళ్లి మగాళ్లు తాగారో లేదో చెక్ చేస్తారని తెలిపారు. చాలాసార్లు ఆ ఇంటి ఆడోళ్లే సమాచారం ఇస్తున్నారన్నారు.