
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం ముంగిట ఉందనే ఆందోళనలతో పాటు డాలర్ పతనం, బాండా ఈల్డ్స్ తగ్గటంతో.. స్టాక్ మార్కెట్లలో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సేఫ్ పెట్టుబడుల వైపు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే భారతీయ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.
జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులు భారీగా పెరిగి రూ.42వేల 702 కోట్లకు చేరిన తర్వాత ఆగస్టులో అవి భారీగా తగ్గి రూ.33వేల 430 కోట్లకు చేరుకున్నాయి. అంటే కేవలం ఒక్కనెలలోనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడుల రాక 22 శాతం పడిపోయినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా వెల్లడించింది. అయితే రిటైల్ పెట్టుబడిదారులు ఎస్ఐపీల ద్వారా ఈక్విటీ మార్కెట్లలోకి తమ డబ్బును పెట్టుబడిగా కొనసాగిస్తూనే ఉన్నట్లు ఆగస్టు డేటా చెబుతోంది.
ALSO READ : శుక్రవారం పెరిగిన గోల్డ్-సిల్వర్..
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు కూడా కొంత అప్రమత్తతతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కింద ఎక్కువగా తమ పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. ఇదే సమయంలో స్మాల్ క్యాప్, థీమ్యాటిక్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా తగ్గుదలను చూశాయి. వాస్తవానికి ఆగస్టు అత్యంత క్లిష్టమైన నెల అయినప్పటికీ పెట్టుబడిదారులు చాలా మంది తమ ఎస్ఐపీలను కొనసాగించారని తేలింది. ఆగస్టులో సూచీలు పనతమైనప్పటికీ పెట్టుబడుల జోరు పెద్దగా ప్రభావితం కాలేదని ఈ డేటా చెబుతోంది.
జూలైలో రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడులు ఉండగా, డెట్ ఫండ్స్ రూ.7వేల 980 కోట్ల పెట్టుబడులు వెనక్కి తగ్గాయి. ఈ తగ్గుదలకు ప్రధానంగా లిక్విడ్ ఫండ్స్ కారణమయ్యాయి. కంపెనీల నుంచి రూ.13వేల 350 కోట్ల భారీ విత్ డ్రాలు కొనసాగాయి. అలాగే ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.4వేల 951 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.2వేల211 కోట్ల నికర ప్రవాహాలను చూశాయి.