ముజఫర్ పూర్…ఆఫ్రికా కన్నా పూర్

ముజఫర్ పూర్…ఆఫ్రికా కన్నా పూర్

ఆఫ్రికా దేశాలు అనగానే అక్కడ తాండవించే పేదరికమే గుర్తొస్తుంది. సరైన తిండి లేక బక్కచిక్కిన బాల్యమే కనిపిస్తుంది. కానీ, బీహార్​లోని ముజఫర్​పూర్​ జిల్లాతో పోలిస్తే మాత్రం వందపాళ్లు ఆ దేశాలే నయమనిపిస్తాయి. అవును మరి, అంతలా పిల్లలు పోషకాహారలోపంతో కుంగి క్రుశించిపోతున్నారు. ఇవేవో అల్లాటప్పాగా చెబుతున్న మాటలు కాదు. గత రికార్డులు, డేటా పరిశీలిస్తే తేలిన విషయం. కొద్ది రోజులుగా ముజఫర్​పూర్​ జిల్లాలో మెదడువాపు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. వంద మందికిపైగా చిన్నారులు దాని ధాటికి బలైపోయారు. దీనికంతటికీ కారణం ఆ జిల్లాలో బీహార్​ ప్రభుత్వం పిల్లలకు సరైన పోషకాహారం అందించకపోవడమేనని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించలేదు. అదే, ప్రస్తుతం మెదడువాపు విజృంభణకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు.

ముజఫర్​పూర్​ ఘోరం…

ముజఫర్​పూర్​లో పిల్లలు, తల్లులకు అందుతున్న పోషకాహారంతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లోనే మెరుగ్గా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో), ప్రపంచ బ్యాంకు, యునిసెఫ్​ డేటా తేల్చి చెబుతోంది. ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​)–4, అక్కడ పిల్లలకు సరైన పోషకాహారమే అందట్లేదని పేర్కొంది. ఐదేళ్లలోపున్న 48 శాతం మంది పిల్లలు సరిగ్గా ఎదగలేదని (స్టంటింగ్​– పొట్టి) చెప్పింది. 17.5 శాతం మంది ఎత్తుకు తగ్గిన ఆకారం లేరని, మరీ బక్కగా ఉన్నారని పేర్కొంది. 42 శాతం మంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారని ఆ సర్వే తేల్చింది. ఆ ఒక్క జిల్లానే కాదు, మొత్తంగా బీహారే చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. ఇప్పుడు దేశంలో పొట్టి పిల్లలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అదే. 38 శాతం మంది పొట్టి పిల్లలు, 36 శాతం మంది బరువు తక్కువ పిల్లలతో బీహార్​ టాప్​లో ఉంది. అదే ఆఫ్రికా దేశాలతో పోల్చినా బీహారే ముందుంది. ఆఫ్రికాలో 31.3 శాతం మంది పిల్లలే సరైన ఎత్తు లేరు. 43 ఆఫ్రికా దేశాల కన్నా ముజఫర్​పూర్​ జిల్లాలోనే స్టంటింగ్​ ఎక్కువగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. అందులోనూ చాలా చాలా పేద దేశాలూ ఆ జిల్లా కన్నా మెరుగ్గానే ఉన్నాయి. ఘనాలో 18.8 శాతం, సియెరా లియోన్​ 28.8%, దక్షిణ సూడాన్​ 31.1%, నైజీరియా 32.9 శాతం, ఉగాండా 34.2%, రువాండా 37.9%తో పోలిస్తే ముజఫర్​పూర్​ ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బక్క పిల్లల సంఖ్యలోనూ ఆఫ్రికానే మెరుగ్గా ఉంది. సగటున అక్కడ 6.3 శాతం మంది పిల్లలు మాత్రమే బక్కగా ఉన్నారు. ఈ జాబితాలో దక్షిణ సూడాన్​ మాత్రమే ముజఫర్​పూర్​ కన్నా దారుణ స్థితిలో ఉంది.

మంచి తిండి దొరకట్లే…

ప్రపంచవ్యాప్తంగా ఏటా 27 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో చనిపోతున్నట్టు డబ్ల్యూహెచ్​వో నివేదిక చెబుతోంది. మొత్తం చిన్నారుల మరణాల్లో పోషకాహార లోపం వాటానే 44 శాతం. ఇక, ముజఫర్​పూర్​ జిల్లాలో పోషకాహారం అందుకుంటున్న 6 నుంచి 23 నెలల మధ్య చిన్నారులు కేవలం 7.8 శాతం. అది ఆఫ్రికా దేశాలైన కెన్యా, రువాండా, ఘనా, నైజీరియా తదితర దేశాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. పుట్టిన గంట నుంచే పిల్లలకు బ్రెస్ట్​ఫీడింగ్​ (తల్లి పాలు) ఇవ్వడం వల్ల ఏటా 8.2 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులను కాపాడొచ్చని డబ్ల్యూహెచ్​వో సూచిస్తోంది. ఈ ఒక్క బ్రెస్ట్​ఫీడింగ్​ విషయంలో మాత్రం ఆఫ్రికాతో పోలిస్తే ముజఫర్​పూర్​ మెరుగ్గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఆరు నెలలలోపు 79 శాతం మంది పిల్లలకు బ్రెస్ట్​ఫీడింగ్​ అందుతోంది. ముజఫర్​పూర్​ కన్నా ఒక్క రువాండ మాత్రమే (87.3%) మెరుగైన స్థానంలో ఉంది. అయితే, తొలి గంటలో ముజఫర్​పూర్​ జిల్లాలో పిల్లలకు తల్లి పాలు పడుతున్నది కేవలం 63 శాతం. ఇన్​ఫెక్షన్లు రాకుండా రోగనిరోధక శక్తి పెరగాలంటే పిల్లలకు తొలి గంటలోపు తల్లి పాలు పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తల్లిపాలు పట్టకపోతే డయేరియా (అతిసార) వంటివి ప్రబలే ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇండియాలో 58 శాతం మంది పిల్లలకు గంటలోపు తల్లిపాలు అందట్లేదు.

రక్తహీనత పెరుగుతోంది…

సరైన తిండి లేక పిల్లలు, తల్లుల్లో రక్తహీనత పెరిగిపోతోంది. ముజఫర్​పూర్​లో అది మరింత ఎక్కువగా ఉంది. 58.5 శాతం (ప్రతి ఐదుగురిలో ముగ్గురు) మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంతేకాదు, 15 నుంచి 49 ఏళ్ల వయసు వారిలోనూ రక్తహీనత ఎక్కువగా ఉంది. దాదాపు 52.4 శాతం మంది దాని బారిన పడ్డారు. గర్భిణుల విషయానికొస్తే 56 శాతం మందికి రక్తహీనత ఉంది. అదే ఆఫ్రికాలో అయితే ముజఫర్​పూర్​ కన్నా తక్కువగా 47.3 శాతం మందికి మాత్రమే ఆ జబ్బు పట్టింది. ఇక, బాడీ మాస్​ ఇండెక్స్​ (బీఎంఐ– ఎత్తుకు తగిన బరువు)లోనూ ముజఫర్​పూర్​ జిల్లా పూర్​గా ఉంది. 15 నుంచి 49 ఏళ్ల లోపున్న 33 శాతం మందికి సరైన బీఎంఐ లేదు. తక్కువ బరువుతో ఉన్నారు. ఈ విషయంలోనూ ఆఫ్రికా దేశాలతో (10.9%) పోలిస్తే ముజఫర్​పూర్​ చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. కాబట్టి ఇకనైనా బీహార్​పై, ప్రత్యేకించి ముజఫర్​పూర్​ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరిన్ని ఘోరాలు జరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.