ప్రజలకు ఆక్సిజన్ అందించాలనుకోవడం తప్పా?

ప్రజలకు ఆక్సిజన్ అందించాలనుకోవడం తప్పా?

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల గోల్ మాల్ జరిగింది. కరోనా పీక్ టైంలో ఢిల్లీ సర్కార్ సిలిండర్ల కొరతను అవసరానికంటే నాలుగు రెట్లు ఎక్కువ చేసి చూపించిందని సుప్రీం కోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ తెలిపింది. ఇది కాస్తా దేశ రాజధానిలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని బీజేపీకి మధ్య చిచ్చు రేపింది. రిపోర్టులో ఉన్న విషయాలపై బీజేపీ అబద్ధాలు చెబుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలకు ఆక్సిజన్ అందేందుకు పోరాడటమే తమ తప్పని కేజ్రీవాల్ అన్నారు. 

‘ఢిల్లీలోని 2 కోట్ల మందికి ఊపిరి అందడం కోసం పోరాడటమే నా తప్పయినట్లుంది. మీరు (ప్రధాని మోడీ) ఎన్నికల ర్యాలీల్లో బిజీగా ఉన్నప్పుడు.. నేను ఆక్సిజన్ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నా. జనాలకు ఆక్సిజన్ అందించేందుకు నేను పోరాడా. అందరినీ వేడుకున్నా. ఆక్సిజన్ లేమితో చాలా మంది తమ ఆప్తులను కోల్పోయారు. వాళ్లను అబద్ధాలుగా చిత్రీకరించకండి. ఇది వాళ్లకు బాధను కలిగిస్తోంది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.