ఇప్పుడు పూర్తి చేస్తాం.. మళ్లీ గెలుస్తాం

ఇప్పుడు పూర్తి చేస్తాం.. మళ్లీ గెలుస్తాం

తమ ప్రభుత్వం పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని, వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధీమా వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం బలంగా ఉందన్నారు. తమకు 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రతిపక్షానికి 99 మంది ఉన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని, అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అటు మహారాష్ట్ర కొత్త ప్రభుత్వానికి ఏక్‌నాథ్ షిండే నాయకుడని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. బీజేపీ పార్టీ తనను ఇంతకు ముందు ముఖ్యమంత్రిని చేసిందని,  ఇప్పుడు పార్టీ అవసరాన్ని బట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.  ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలో పని చేస్తాయని, ఆయనే తమ నాయకుడని ఫడ్నవీస్ అన్నారు.

ఇదిలావుండగా మంత్రివర్గ విస్తరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో శనివారం షిండే, ఫడ్నవీస్‌లు సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. చర్చల్లో షిండే వర్గానికి 11 మంత్రి పదవులు ఆఫర్ చేసిందని, తమ పార్టీ నుంచి 29 మంది మంత్రులు ఉండాలని బీజేపీ సూచించినట్లు సమాచారం. నడ్డా కంటే ముందురోజు వీరిద్దరూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. నాలుగు గంటల పాటు కొత్త మంత్రివర్గం ఏర్పాటుతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపైన చర్చించారు. మహారాష్ట్ర క్యాబినెట్‌ను రెండు దశల్లో విస్తరించనున్నారన్నచర్చ నడుస్తోంది. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు మొదటి విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్ధవ్ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు షిండే వర్గంలో చేరగా, ఇప్పుడు వీరందరికీ మళ్లీ మంత్రి పదవులు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.