‘మహా’ సంక్షోభానికి కారణం బీజేపీయే

‘మహా’ సంక్షోభానికి కారణం బీజేపీయే

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కారణం బీజేపీనేనని, ఇదంతా  ఆ పార్టీ ఆడిస్తున్న ఆటగా అభివర్ణించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని పేర్కొన్న ఆయన..బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండొద్దని ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జూన్ 23వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా నడుస్తున్నాయని, ఎమ్మెల్యేలను సూరత్ కు తీసుకెళ్లారని.. ఎందుకంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉందో అందరికి తెలిసిందేనన్నారు. అనంతరం వారిని గౌహతికి తీసుకెళ్లారన్నారు. మహారాష్ట్రలో బలంగా ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకే బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికంతటికీ కారణం రాష్ట్రపతి ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి మరింత సంఖ్యా బలం కావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎన్నికలకు ముందే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మహా వికాస్ అగాఢీలోని మూడు పార్టీలు కలిసి పోరాడుతాయని ఖర్గే స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తోందని.. కానీ వీటిని నిలువరించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో కర్నాటక, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది.మరోవైపు రెబెల్ గా మారిన ఏక్ నాథ్ షిండే శిబిరంలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. దీంతో శివసేన కాస్త షిండే సేనగా మారిపోయినట్లుగా పరిణామాలు మారుతున్నాయి. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లోకి ఇవాళ ఉదయం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఏక్ నాథ్ షిండే క్యాంప్ లోకి వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఇండిపెండెంట్లతో కలిపి తనకు 46 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉందని ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం పడిపోతే ఏం జరుగుతుందన్న విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. షిండే వర్గంతో బీజేపీతో జట్టు కడితే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమే అంటున్నారు