తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ఓడగొట్టడమే తన టార్గెట్ అని.. అదే తన జీవితాశయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనే కేసీఆర్‌పై పోటీ చేస్తానన్నా. హుజురాబాద్ లో కేసీఆర్ పోటీ చేసినా ఢీకొంటానన్నారు. ఆయన్ను ఓడగొట్టకపోతే తన జన్మకి అర్థం లేదన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రళయం సృష్టించబోతోందని తెలిపారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా వేల సంఖ్యలో నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. శనివారం హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈటల ప్రెస్ మీట్ నిర్వహించారు.
బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ హై కమాండ్ తనకు అప్పచెప్పిందని తెలిపారు. బీజేపీ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నట్లు, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలువాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారన్నారు. నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే నోటితో పీకుతానన్నారు. తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూళ్లు అధ్వాన్నంగా తయారైనట్లు విమర్శించారు. ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్లు, విద్యార్థులు తినే ఆహారంలో వానపాములు, బొద్దింకలు వస్తున్నాయన్నారు. కాంట్రాక్టర్ లకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదన్నారు. మంత్రులు స్వతంత్రంగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదన్నారు. ఫామ్ హౌస్ లేకుంటే ఢిల్లీలో కేసీఆర్ ఉంటుండటంతో కనీస పర్యవేక్షణ చేసే వారు లేరని విమర్శించారు. ఇప్పటి వరకు స్కూల్స్ లో బుక్స్ ఇవ్వలేని దుస్థితి తెలంగాణలో నెలకొందన్నారు.
