V6 News

తాగి కారు నడిపి డివైడర్​ను ఢీకొట్టిండు

తాగి కారు నడిపి  డివైడర్​ను ఢీకొట్టిండు
  • ఒకరి మృతి .. మరో ఇద్దరికి గాయాలు
  • మైలార్​దేవ్ పల్లిలో ఘటన 

శంషాబాద్, వెలుగు: తాగి కారు నడిపిన ఓ వ్యక్తి డివైడర్​ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ ఘటన మైలార్​దేవ్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన చంద్రశేఖర్(25) కుటుంబం కొంతకాలం కిందట సిటీకి వచ్చి మైలార్​దేవ్​పల్లి పరిధి టీఎన్జీవోస్ కాలనీలో ఉంటోంది. చంద్రశేఖర్ బుధవారం అర్ధరాత్రి తన ఫ్రెండ్స్ శివం, వికాస్​తో కలిసి శంషాబాద్​కు వెళ్లాడు. వికాస్ క్యాబ్ డ్రైవర్ కాగా.. అతడి కారులోనే ముగ్గురూ బయటికెళ్లారు. కారు డ్రైవ్ చేస్తున్న చంద్రశేఖర్ సిగరెట్ల కోసం కాటేదాన్ నుంచి దుర్గానగర్ వైపు పోనిచ్చాడు.  

అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో దుర్గానగర్ చౌరస్తా వద్ద కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని పల్టీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శివం, వికాస్ సైతం తీవ్రంగా గాయపడగా.. పోలీసులు వారిని హాస్పిటల్​కు తరలించారు. శివం, వికాస్​కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా.. మద్యం తాగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు.  

అప్పా జంక్షన్ వద్ద మరో ప్రమాదం..

గండిపేట: నార్సింగి పరిధి అప్పా జంక్షన్ వద్ద గురువారం రాత్రి ఆటోను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఉపేందర్ మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

ట్యాంకర్ ఢీకొని మరొకరు..

బాలానగర్: రెడీమిక్స్ ట్యాంకర్ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన నిరుడు మనోహర్(21) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బైక్ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. బైక్ స్పేర్ పార్ట్స్ కోసం గురువారం ఉదయం గుమ్మడిదల నుంచి బాలానగర్​కు వచ్చాడు. మధ్యాహ్నం బైక్ పై తిరిగి బయలుదేరాడు. బాలానగర్​లోని నర్సాపూర్ క్రాస్ రోడ్ వద్ద రెడీమిక్స్ ట్యాంకర్ అతడి బైక్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మనోహర్ అక్కడికక్కడే మృతి చెందాడు.