మిస్టరీ : భూతల స్వర్గం ఎందుకు అంతమైంది?  

మిస్టరీ :  భూతల స్వర్గం ఎందుకు అంతమైంది?  

ఒకప్పుడు అది భూతల స్వర్గం. అక్కడివాళ్లు ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా బతికేవాళ్లు. పొద్దంతా చిన్న చిన్న పడవల మీద వెళ్లి చేపలు పట్టేవాళ్లు. ఆకాశంలో చుక్కలు కనిపించగానే చీకటైందని ఇళ్లకు తిరిగి వచ్చేవాళ్లు. ఉన్న కాస్త భూమిలోనే వాళ్లకు కావాల్సినవి పండించుకునేవాళ్లు. అలాంటి ఒక అందమైన ప్రపంచంలో కొన్నాళ్లకు చెట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మనుషులు తగ్గిపోయారు. అలా ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ ద్వీపంలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. కానీ.. వాటిని ఎందుకు చెక్కారనేది ఇప్పటికీ తెలియదు?  

కొన్ని వందల సంవత్సరాల క్రితం చిలీకి దగ్గరలో ఉన్న ఈస్టర్ ఐలాండ్‌‌‌‌లో రప నూయి అనే ఒక తెగ ఉండేది. వాళ్లు పాలినేషియన్లు. అంటే పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ట్రయాంగిల్‌‌‌‌లోని ద్వీపాలకు చెందిన వాళ్లు. ఆ దీవి అంతా పచ్చని తివాచీ పరిచినట్టు ఉండేది. వేల కొద్దీ పెద్ద పెద్ద తాటి చెట్లు ఉండేవి. 63 చదరపు మైళ్ల ఐలాండ్‌‌‌‌లో కొన్ని వేలమంది బతికేవాళ్లు. అందరూ ఒకరికి మరొకరు సాయం చేసుకుంటూ హాయిగా ఉండేవాళ్లు. అవుట్‌‌‌‌రిగర్ పడవల మీద సముద్రంలో వేటకు వెళ్లేవాళ్లు. ఆ అందమైన దీవికి వాళ్ల తెగపేరు మీదుగానే ‘రప నూయి’ అని పేరు పెట్టుకున్నారు. ఏమైందో తెలియదు కానీ.. ఒక్కొక్కరుగా ఆ ఐలాండ్‌‌‌‌ని వదిలివెళ్లిపోయారు. పచ్చదనం లేకుండా పోయింది.  ఈ ఐలాండ్‌‌‌‌ ప్రపంచం నుంచి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. దక్షిణ అమెరికాకు పశ్చిమాన దాదాపు 2,300 మైళ్ల దూరంలో, చిలీ నుంచి దాదాపు 1,100 మైళ్ల దూరంలో ఉంటుంది. అందుకే  దాని గురించి చాలా రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. 1722లో ఈస్టర్ రోజున డచ్ ఎక్స్‌‌‌‌ప్లోరర్స్‌‌‌‌ ఈ ద్వీపాన్ని కనుగొన్నారు. అందుకే దీనికి ‘ఈస్టర్‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌’ అనే పేరు పెట్టారు. ఈ నేలపై అడుగుపెట్టిన మొదటి యూరోపియన్లు వీళ్లే. డచ్‌‌‌‌ వాళ్లు వచ్చేసరికి ఐలాండ్‌‌‌‌ మనుషుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విగ్రహాలు కనిపించాయి. ఇంతకీ ఆ విగ్రహాలు ఎవరివి? ఆ ఐలాండ్‌‌‌‌లో ఉన్నవాళ్లు ఆ విగ్రహాలను ఎలా చెక్కగలిగారనేది ఇప్పటికీ మిస్టరీనే. 
కారణాలేంటి? 
ఈ ఐలాండ్‌‌‌‌లో ఉన్నవాళ్లు ఎక్కడికెళ్లారు? ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఎక్కువమంది ఆర్కియాలజిస్ట్‌‌‌‌లు ఇక్కడి తెగ ప్రజలు ప్రకృతిని నాశనం చేయడం వల్ల బతకడానికి ఆధారం లేకుండా పోయింది. అందుకే వాళ్లు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందంటున్నారు. ఇంకొందరు మాత్రం డచ్‌‌‌‌ వాళ్లు వచ్చేసరికి చాలామంది ఇక్కడున్నారు. కానీ.. యూరోపియన్లు ఇక్కడివాళ్లను బానిసలుగా తీసుకెళ్లడం వల్ల రప నూయిల సంఖ్య తగ్గిందంటున్నారు. వ్యవసాయం చేయడానికి ఇక్కడ చాలా తక్కువ ప్లేస్‌‌‌‌ ఉంది. అందువల్ల చెట్లు నరుకుతూ వ్యవసాయాన్ని విస్తరించారు. ఇంకొందరు వంటచెరుకు కోసం చెట్లు నరికారు. దాంతోపాటు ఇక్కడ తయారుచేసిన విగ్రహాలను తీర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి కలప వాడారు. అందుకోసం చెట్లు నరకాల్సి వచ్చింది. దాంతో ప్రకృతి నాశనం అయిపోయింది. చెట్లు లేకపోవడం వల్ల పక్షులు రావడం మానేశాయి. దాంతో వ్యవసాయం కష్టమైంది. అందుకే ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఎక్కువమంది ఆర్కియాలజిస్ట్‌‌‌‌లు ఒప్పుకున్నప్పటికీ ఇంకా కొందరు దీన్ని ఒప్పుకోవడంలేదు. పైగా రప నూయిలు ద్వీపంలోకి వచ్చిన టైం, వాళ్ల నాగరికత ఎందుకు అంతరించింది? అనేదానిపై ఇప్పటికీ రీసెర్చ్‌‌‌‌ జరుగుతూనే ఉంది. 
ఎప్పుడొచ్చారు? 
ఈ ప్రాంతానికి దాదాపు క్రీ.శ. 800 సంవత్సరానికి ముందు రప నూయి తెగవాళ్లు వచ్చి ఉంటారని అంచనా. రప నూయి కల్చర్‌‌‌‌‌‌‌‌ కొన్ని వందల సంవత్సరాలపాటు డెవలప్‌‌‌‌ అయ్యిందని కొందరు హిస్టోరియన్లు చెబుతున్నారు. కానీ.. అక్కడ చాలా టెస్ట్‌‌‌‌లు చేసిన మరికొందరు మాత్రం 1200వ సంవత్సరంలో ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది ఇక్కడి వచ్చారని వాళ్లే రప నూయిలు అని చెబుతున్నారు. వాళ్లు వచ్చిన కొంతకాలానికే జనాభా విపరీతంగా పెరిగింది. అంతేకాదు వాళ్లలో వాళ్లకు యుద్ధాలు కూడా జరిగాయని చెబుతున్నారు. 
బానిసల కోసం..
యూరప్‌‌ వాళ్లు ఈ ద్వీపాన్ని కనుగొన్నప్పటినుంచి అక్కడివాళ్లను బానిసలుగా చేసుకున్నారని అందుకోసం దాడులు చేసేవాళ్లని కొందరు వాదిస్తున్నారు. 1860 ప్రాంతాల్లో జరిగిన వరుస దాడుల్లో ఈ ద్వీపంలోని చాలామందిని హత్య చేశారు. అందువల్లే ద్వీపం ఖాళీ అయిందని చెబుతున్నారు. 1862 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో బానిసల కోసం పెరూ సైనికులు ఈస్టర్ ద్వీపంపై దండయాత్ర చేశారు. కొన్ని నెలలపాటు ఇక్కడే ఉండి వాళ్లను హింసించారు. చివరకు ద్వీపంలో నుంచి 1,500 మందిని బలవంతంగా బానిసలుగా తీసుకెళ్లారు. ఇలా బానిసల కోసం చేసిన దాడుల వల్ల కూడా చాలామంది చనిపోయారు. 
మహమ్మారులు
బానిసల కోసం దాడులు చేసే సైనికులు అనేక దీవుల్లో తిరుగుతూ అక్కడినుంచి మాతృదేశానికి బానిసలను పంపేవాళ్లు. దానివల్ల ఒక ద్వీపంలో ఉన్న అంటువ్యాధులు సైనికుల ద్వారా మరో ద్వీపానికి వ్యాపించేవి. అలాగే ఈ ద్వీపానికి వచ్చిన సైనికులు ఇక్కడి వాళ్లకు మశూచి లాంటి మహమ్మారులను అంటించి వెళ్లారని, అందువల్లే ఇక్కడి జనాభా అంతరించిపోయిందని కూడా కొందరు చెబుతున్నారు. ఒక దశలో ఈస్టర్ ద్వీపంలో చనిపోయినవాళ్లను పూడ్చిపెట్టడానికి సరిపడా మనుషులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు 1800వ శతాబ్దం మధ్యకాలంలో తిమింగలాలను వేటాడే జాలర్లకు టీబీ వ్యాధి వ్యాపించింది. ఈ దీవిలోని చాలామందికి ఈ వ్యాధి వచ్చి, ఇక్కడ జనాలు లేకుండా మారడానికి ఒక కారణమైందంటారు చాలామంది.  
ఎలుకలే కారణమా? 
ఈస్టర్‌‌‌‌‌‌‌‌ ద్వీపంలో గతంలో చెట్లు, గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉండేవని రీసెర్చ్‌‌‌‌ల్లో తెలిసింది. ఇక్కడ కొన్ని వేల తాటిచెట్లు ఉండేవని సైంటిస్ట్‌‌‌‌లు కనుగొన్నారు. వాటి శిలాజాలు ఇప్పటికీ ఉన్నాయి. సైంటిస్ట్‌‌‌‌ టోనీ హంట్ చేసిన రీసెర్చ్‌‌‌‌లో ఇవన్నీ ఎలుకల వల్లే నాశనం అయ్యాయని తేలింది. ఎందుకంటే.. ఇక్కడ తవ్వినప్పుడు దొరికిన 99 శాతం గింజలపై ఎలుక దంతాల గుర్తులు కనిపించాయి. ఎలుకలు కొరకడం వల్లే అవి మొలకెత్తలేదు. చాలా ఎక్కువ ఎలుకలు ఉండడం వల్ల అక్కడ రాలిన విత్తనాలన్నింటినీ తినేశాయి. దాంతో మొలకలు రాక.. చెట్ల పునరుత్పత్తి ఆగిపోయిందని హంట్‌‌‌‌ చెప్పారు. ఎలుకలకు కూడా తినడానికి గింజలు దొరక్క అవి కూడా చనిపోయాయి. ఇక్కడ నేలను తవ్వినప్పుడు ఎలుకల ఎముకలు కూడా ఎక్కువగా దొరికాయి. అంతేకాదు సముద్రపు మడ్డిలో దొరికిన పుప్పొడిపై రీసెర్చ్‌‌‌‌ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువగా రెల్లు జాతి గడ్డి ఉండేదని తెలిసింది. ఈ ద్వీపంలో ఆ గడ్డి 30,000 సంవత్సరాలుగా పెరుగుతున్నట్లు గుర్తించారు. అందువల్ల చెట్లు నాశనం అయ్యాక కూడా యూరప్‌‌ వాళ్లు ఇక్కడ గొర్రెలను పెంచారు. మనుషులు అడుగు పెట్టకముందు ఈ ద్వీపం ఒక అడవిలా ఉండేదట. సముద్రపక్షులు కూడా ఉండేవట. 
ప్రతి ఆరు వారాలకు రెట్టింపు 
ఈస్టర్‌‌‌‌‌‌‌‌ ద్వీపంలో ‘రాటస్ ఎక్సులన్స్’ అనే ఎలుకలు ఉండేవి. వీటికి కావాల్సిన తిండి ఇక్కడ కావాల్సినంత దొరికేది. పైగా వాటిని వేటాడే జంతువులు ఇక్కడ లేవు. దాంతో వాటి సంఖ్య ప్రతి ఆరువారాలకు రెట్టింపు అయ్యేది. వాటికి తిండి ఇచ్చే చెట్లు అంత వేగంగా పెరగవు. అందుకే తిండి దొరక్క ప్రతి గింజను తినేవి. ఇలాంటప్పుడు ఎలుకలు పర్యావరణం నాశనం కావడానికి కారణమవుతాయి. ఉదాహరణకు.. హవాయిలోని ఓహు ద్వీపంలో 900 నుంచి 1100 సంవత్సరాల మధ్య అడవి నాశనం అయింది.1250వ సంవత్సరం వరకు అక్కడ మనుషులే లేరు. అయినా అడవి అంతమైపోయింది. అందుకు కారణం ఎలుకలే. కానీ.. రాటస్ ఎక్సులన్స్ ఎలుకలు ఎక్కువగా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. 
మోయిలు 
ఈ ద్వీపాన్ని యూరప్‌‌ వాళ్లు కనుగొన్నప్పుడు ఇక్కడ దాదాపు 887 పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వీటిని ‘మోయిలు’ అని పిలుస్తారు. వీటిని ఎవరు చెక్కారనే దానిపై కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. చాలా తక్కువమంది ఉండే ఈ ద్వీపంలో వీటిని మనుషులు చెక్కడం సాధ్యం కాదని, ఏలియన్స్‌‌‌‌ వీటిని చెక్కి ఉండొచ్చని చెబుతుంటారు. ఎక్కువమంది సైంటిస్ట్‌‌‌‌లు మాత్రం రప నూయి ప్రజలే వీటిని చెక్కారని చెబుతున్నారు. ఈ విగ్రహాల వల్ల ఇది ఇప్పుడు ఫేమస్‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌ స్పాట్‌‌‌‌గా మారింది. వీటిని 1100–-1680 సంవత్సరాల మధ్య చెక్కినట్టు రేడియో-కార్బన్ టెస్ట్‌‌‌‌ల ద్వారా తెలిసింది. ఈ విగ్రహాలు భూమిలో పూడ్చి ఉండి, తలలు మాత్రమే పైకి కనిపిస్తాయి. అందువల్ల వీటిని ‘‘ఈస్టర్ ఐలాండ్ హెడ్స్”అని కూడా పిలుస్తుంటారు. వీటిలో కాళ్లపై కూర్చున్న, ఉన్నవి, నిలబడిన విగ్రహాలు ఉన్నాయి. 
అగ్నిపర్వతపు బూడిద
కొన్ని అగ్ని పర్వతాలు పేలినప్పుడు వచ్చే బూడిద.కొంతకాలానికి గట్టిగా రాయిలా మారుతుంది. అలాంటి రాళ్లతోనే వీటిలో దాదాపు 95శాతం విగ్రహాలు చెక్కారు. అప్పట్లో పెద్దగా పనిముట్లు కూడా వీళ్ల దగ్గర లేవు. వీటిని చెక్కడం కోసం వాళ్లు రాతి పనిముట్లు వాడారు. రాతి ఉలులకు పదును తగ్గితే మళ్లీ పదును పెట్టేవాళ్లు. ఈ విగ్రహాలు ఎందుకు చెక్కారనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కొంతమంది సైంటిస్ట్‌‌‌‌లు మాత్రం రప నూయిలు పూర్వీకుల గుర్తుగా ఇలా విగ్రహాలు చెక్కేవాళ్లని చెబుతున్నారు. వాళ్లు చెక్కిన వాటిలో కొన్ని విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించారు. మిగతావి ద్వీపంలోని వేర్వేరు ప్రాంతాల్లో చెక్కిన చోటే ఉన్నాయి. బహుశా వాటిని తరలించడం కష్టమని అక్కడే వదిలేసి ఉండొచ్చు. ఒక్క విగ్రహాన్ని లాగేందుకు బరువును బట్టి సుమారుగా 180 నుంచి 250 మంది మగవాళ్లు పని చేయాల్సి వచ్చేది. ఇవి -సగటున 13 అడుగుల ఎత్తు, 14 టన్నుల బరువు ఉన్నాయి. 
విగ్రహాలను లాగేందుకు... 
ఈ విగ్రహాలను లోతట్టు క్వారీల్లో చెక్కేవాళ్లు. కానీ.. వాటిని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న తీరానికి తరలించేవాళ్లు. అందుకోసం వాళ్లు ప్రత్యేకంగా ఒక టెక్నాలజీని వాడేవాళ్లు. చెక్కలు, తాళ్లు వాడి విగ్రహాన్ని నడిపిస్తూ తీసుకెళ్లేవాళ్లు. అయితే.. ఈ టెక్నాలజీ కోసం చాలా కలప అవసరమయ్యేది. అందువల్ల ప్రజలు తాటిచెట్లను ఎక్కువగా నరికారు. దాంతో ప్రకృతి నాశనమైందని కొందరు అంటున్నారు. పాలినేషియన్లు ఈ ద్వీపాన్ని ఎప్పుడు వలస రాజ్యంగా మార్చుకున్నారు? వాళ్ల నాగరికత ఎందుకు అంత త్వరగా కుప్పకూలింది? అనే ప్రశ్నలకు సైంటిస్ట్‌‌లు ఇప్పటికీ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఎలుకల వల్ల నశించిందా?  మనుషులు చేసిన తప్పుల వల్ల నశించిందా? అనేది పక్కన పెడితే.. ప్రకృతి నశిస్తే మనిషి బతకలేడనే కఠోర నిజాన్ని మనకు తెలియజేసింది. ఈ ద్వీపం కథ ప్రపంచానికి ఒక హెచ్చరికగా మిగిలింది. 
                                                                                                                                                                                                                    ::: కరుణాకర్​ మానెగాళ్ల