
- ఈమెయిల్ లో ఫిర్యాదు చేసిన టీబీజీకేఎస్ మాజీ ప్రెసిడెంట్
- బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు అధికారికంగా భూములు భవనాలు కేటాయించారని ఆరోపణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్‌పై టీబీజీకేఎస్ మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత కాంగ్రెస్ లీడర్ ఆకునూరి కనకరాజు.. సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఈ మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. తన కంప్లైంట్‌పై సీఎం ఆఫీస్ స్పందించిందని ఆయన చెప్పారు. పూర్తి వివరాలను ఇవ్వాలని తనకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని మీడియాకు ఆయన తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన సీఎండీ గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అధికారికంగా సింగరేణి భవనాలు, క్వార్టర్లు, భూములను కేటాయించారని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఓ టీబీజీకేఎస్ నేత దాదాపు 70కి పైగా క్వార్టర్లను ఆక్రమించుకొని వాటిలో కొన్నింటిని అద్దెకు ఇచ్చినట్లు సీఎంకు ఫిర్యాదుచేశానని వెల్లడించారు.
బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి, పినపాక, చెన్నూర్ ఎమ్మెల్యేలకు పలు క్వార్టర్లను ఇష్టారాజ్యంగా కేటాయించారని తెలిపారు. ఆ కేటాయింపులను రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు. సింగరేణి నిధుల మళ్లింపుపై సీఎండీపై సమగ్ర విచారణ చేపట్టాలని తాను సీఎంకు విజ్ఞప్తి చేశానని కనకరాజు తెలిపారు.