అక్షర ప్రపంచం : నా నుంచి మన వరకు పుస్తక సమీక్ష

అక్షర ప్రపంచం : నా నుంచి మన వరకు పుస్తక సమీక్ష

‘నా నుంచి మన వరకు’14 కథల సంకలనం. కథ రాయడం, కథ చెప్పినంత ఈజీ కాదు. అందులోనూ పాఠకులు మెచ్చేలా కథ రాయడం మాటలు కాదు. రచయిత డా. టి సంపత్​కుమార్​ ఢిల్లీలోని కెనడియన్​ హై కమిషన్​లో సీనియర్​ సలహాదారునిగా పనిచేశారు. ఆదిలాబాద్​జిల్లాలో పుట్టి పెరిగి, ఢిల్లీ దాకా ఎదిగే క్రమంలో ఆయన సంపాదించిన జ్ఞానం, అనుభవం, తెలుగు, ఇంగ్లీష్​ భాషల్లో ఆయనకున్న పాండిత్యాన్ని  చూసినప్పుడు సంపత్​కుమార్​ సాహిత్యంపై అనేక అంచనాలుంటాయి. ఈ పుస్తకంలోని చాలా కథలు ఆ అంచనాలను అందుకున్నాయి. 

కథల నిడివి, కథాంశాల పరిధి దృష్ట్యా బలమైన పాత్రలు లేకపోయినా బలమైన అభివ్యక్తి ఉన్నది. రచయిత అనుభవాల్లోంచి పుట్టినవి కావడం వల్ల కథల్లో జీవం కదలాడుతుంటుంది. పాత్రోచిత యాస, భాషల వల్ల పాఠకుడికి ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. కైతను తొడుక్కున్న వచనం, రచయితలో దాగిన భావుకుడ్ని అనేకసార్లు బయటపెట్టింది.

‘కంచెల మధ్య’ కథలో ‘‘ నల్లబంగారం తన నలుపుకి తిలోదకాలిచ్చి ఎరుపు రంగుని పెంచుకుంటూ కడుపులో దాచుకున్న శక్తితో ఛాయ్​ గిన్నె అడుగు భాగాన్ని జ్వాలలతో కప్పేస్తుంది.. నిప్పుల బిస్తర్​పై ఒదిగున్న గిన్నెలో బుసకొట్టడానికి చిన్నిచిన్ని బుడగల్ని వదులుతున్నాయి” అంటూ ఛాయ్​ కాసే దృశ్యాన్ని అలవోకగా కండ్ల ముందు ఆవిష్కరించాడు రచయిత. ‘నా నుంచి మన వరకు’ కథలో వన మేథం గురించి చెప్తూ– ‘వృక్షాలు భూమి తల్లి నుంచి బొడ్డుతాళ్లని తెంపుకున్నాయి.. ఆర్థోపెడిక్​ వార్డుల్లో అంగాలు విరిగినవారు చిత్ర విచిత్ర ఆకృతుల్లో పడకలపై ఒదిగినట్లు చెట్లు.. ఎకరం అడవి అంగవస్త్రం లేనిదైంది..’ ఎంత గొప్ప వ్యక్తీకరణ కదా! ఇలాంటి వర్ణనలు ఎన్నో పుస్తకంలో చూడవచ్చు.

కథ విరామంలో సమకాలీన సంఘటనలు వివరించి, కథాగమనాన్ని కాలగమనంతో జోడించడమనే లక్ష్యాన్ని సాధించాడు. ‘మధ్యలో ప్రధాన మంత్రి నాలుగు దేశాలు తిరిగి ఆ దేశాలతో సంబంధాలను బలపరిచి వచ్చారు..’ ‘పేదల ఖాతాల సంఖ్య కోట్లకి చేరింది.. వాళ్ల ఇళ్లల్లో ఉన్న కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి చేరాయి..” అంటూ ఆలోచనలో పడేస్తాడు రచయిత. మొదటి కథ ‘తాతయ్య దంతం’ హాస్య ప్రధానమైంది. ఏడు పదులు దాటిన తన శరీరంలో ఒక భాగంగా ఉన్న దంతాన్ని తొలగించడం, ఈ క్రమంలో భార్యాభర్తల నడుమ జరిగిన సంభాషణ కడుపుబ్బా నవ్విస్తుంది. ‘గ్లవ్స్​ వేసుకున్న వేళ్లు నొప్పున్న పంటితో మరికొంత సరసం చేశాయి..’ లాంటి డైలాగ్స్​ వంటివి చాలా ఉన్నాయి. 

వృద్ధ తల్లిదండ్రులను స్వదేశంలో వదిలేసి విదేశాలకు ఎగిరిపోయిన ఎన్​.ఆర్​.ఐ.లను మనసులేని మరమనుషుల్లా చూపే తెలుగు సిన్మాలకు సంపత్​కుమార్​ కథలు భిన్నంగా నడిచాయి. ఈ పుస్తకంలోని తాతయ్య దంతం, మన‘వరాలు’, అన్యోన్యం.. ఇలా మూడు కథలు కూడా పేగుబంధం చుట్టూ అల్లుకున్న ప్రేమాప్యాయతలను ఏ ఖండాలూ విడదీయలేవని చెప్తాయి. ఎల్లలు దాటిన స్నేహబంధం గురించి ‘నా దోస్త్​ టామ్’​లో చదవొచ్చు. సామాన్యులకు కొరుకుడుపడని కొయ్యలా ఉండే దౌత్యకార్యాలయాల్లోని వర్క్​కల్చర్​, సంక్లిష్టతల గురించి అ(సాధారణత్వం) కథ చెప్తుంది. ఇది రచయిత స్వీయానుభవం.

సంపత్​కుమార్​ పక్కా ఫెమినిస్టు. అలాగని పరుష పురుషపుంగవుల ద్వారా మహిళా పాత్రలతో కన్నీళ్లు కార్పించే స్త్రీ పక్షపాతి మాత్రం కాదు. ఓ కథలో పంటిని పీకించుకునేందుకు సైతం ప్రాణాలు పోయినంత పనిచేసే మొగుడిని, భార్య పక్షాన పరిహాసమాడేంత! ‘తాతయ్య దంతం’లోని  సుచిత్ర, స్త్రీల గుండె నిబ్బరానికి, కొండంత ఆత్మస్థయిర్యానికి ప్రతీకలా నిలుస్తుంది. ఇంకో కథలో భర్తను క్యాబ్​లో పంపి తాను కారు నడుపుకుంటూ ఫంక్షన్​కు పోతుంది అనసూయ! వీటిని చిన్న అంశాలుగా తీసి పక్కన పెట్టలేం! ‘మొఖాలకు గుండాలు’ స్త్రీ సాధికారత దిశగా చక్కని కథ. సర్పంచ్​ జయ, వార్డు మెంబర్​ ఎల్లవ్వ పాత్రలు స్త్రీ శక్తికి ప్రతిరూపాలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ద్వారా ప్రజాప్రతినిధులుగా గెలిచి, భర్త చాటున అనామకంగా మిగిలిపోతున్న ఎందరో మహిళలకు ఇది టానిక్​లాంటి స్టోరీ. ఇక ‘కంచెల మధ్య’ కథలోనైతే తల్లిదండ్రుల సంప్రదాయ ఆలోచనా సంకెళ్లను తెంపుకొని సమాజ సేవకు తరలిన నేటితరానికి ప్రతీకగా దీప్తి పటంకర్​ పాత్ర నిలిచిపోతుంది. పంజాబ్​లోని పాకిస్తాన్​, ఇండియా బోర్డర్​లో  రెండు కంచెల మధ్య 200కి పైగా గ్రామాలకు చెందిన11వేల కుటుంబాల వ్యథే ఈ కథ. ఇరు దేశాల నేతలకు అదో యుద్ధభూమి. కానీ, అక్కడి ప్రజలకు కడుపు నింపే నేలతల్లి. ఏ వైపు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియదు. అలాగని బతుకు పోరాటం ఆగదు. చాలామంది రచయితలకు సహజంగా పట్టని ఇలాంటి కథావస్తువును ఎన్నుకోవడం సంపత్​కుమార్​లోని సామాజిక స్పృహకు అద్దంపడుతుంది. డాక్యుమెంటరీలా సాగిన ఈ కథ ఎక్కడో అసంపూర్తిగా మిగిలినట్టు అనిపిస్తుంది. 

గల్ఫ్​ వ్యథలపై చాలా కథలు వచ్చినా ‘థుబాయ్​’ కథ భిన్నంగా ఉంది. వలస జీవులను మోసుకుంటూ విమానం దుబాయ్ ​వైపు దూసుకుపోతున్నప్పుడు, వాళ్లకి వీడ్కోలు పలికేందుకు వచ్చిన బంధాలు కార్లు, బస్సులతో తిరుగు పయనమవుతాయి. ఈ క్రమంలో అటు నింగిలో, ఇటు నేల మీద జరిగే మానసిక సంఘర్షణను ఈ కథలో రచయిత చిత్రించారు. ‘మనసుల్లోకి తొంగి చూడలేం.. మాయా మర్మాలని కనిపెట్టలేం.. గుప్పెడు మనసు.. కనబడని సొగసరి’ అంటూ చురకత్తుల్లాంటి సుభాషితాలతో రచయిత హత్తుకుంటారు.

‘నా నుంచి మన వరకు’ కథ సినిమాటిక్​గా అనిపిస్తుంది. యాక్షన్​ మూవీని తలపించే ఇంట్రడక్షన్​, మధ్యలో సస్సెన్స్ థ్రిల్లర్​ను మరిపించి, చివర్లో హీరో ముసుగు తొడుక్కున్న విలన్ల నైజాన్ని బయటపెడ్తుంది. మానవాళికి ఇదో వార్నింగ్​. ఇక ప్రకృతి వైపరీత్యాలు, సర్కారు, దళారుల ఆగడాల మధ్య చితికిపోతున్న రైతుల దీనస్థితిని ‘పొక్కల సంచి’ ఆవిష్కరించింది. ఎవుసమనే కైలాస ఆటలో నిచ్చెన్లు తక్కువై పాములు ఎట్లా పెరుగుతున్నాయో రచయిత కళ్లకుగట్టారు. మూడు లోకాల్ని కలుపుకొని పెరిగే వరి జీవితాన్ని, ఆ వెన్నులే దన్నుగా బతికే రైతుల వ్యథను నేటితరానికి సైతం అర్థమయ్యేలా చక్కగా వర్ణించారు. ‘అన్యోన్యం’ కథ ద్వారా 2020 కరోనా కాలపు భయానక పరిస్థితులు, కల్లోల సమయంలో కుటుంబసభ్యుల మధ్య మరింత పెనవేసుకున్న ఆత్మీయబంధాలు ఒక్కసారిగా కండ్ల ముందు కదలాడతాయి. నిజానికి ఒకటిరెండు తప్ప మిగిలిన కథాంశాలు పాతవే. అయినా కథలు చెప్పిన విధానం కొత్తగా, శైలి భిన్నంగా ఉన్నది. అందుకే  ‘ నా నుంచి మన వరకు’ అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. - చిల్ల మల్లేశం, 9490700060