
- టీఆర్ఎస్పై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నరు
- నిత్యం ప్రజల మధ్య ఉండాలి.. వాళ్ల సమస్యలపై పోరాడాలి
- రాష్ట్రంపై జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని వెల్లడి
- ఆఫీస్ బేరర్ల మీటింగ్లో బీజేపీ నేతలతో నడ్డా
ఇప్పటి వరకు కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలు చేపట్టిన పోరాటాలు భేష్. ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. స్వయంగా నేనే హైదరాబాద్ కు వచ్చి నిరసన ర్యాలీలో జాయిన్ అయి, కేసీఆర్ కు వ్యతిరేకంగా అంత స్ట్రాంగ్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడానంటే మీరు అర్థం చేసుకోవాలి.. టీఆర్ఎస్ సర్కార్ పై సెంట్రల్ పార్టీ పాలసీ ఎలా ఉందో మీరు గుర్తించాలి. నడ్డా
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ సర్కారుపై స్ట్రాంగ్ గా ఫైట్ చేయాలని, ఎక్కడా తగ్గొద్దని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్ జరిగింది. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నడ్డా చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ సీనియర్లులక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రాజాసింగ్ పాల్గొన్నారు.
‘‘తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం చాలా ఫోకస్ పెట్టింది. ఈ విషయం గతంలో అమిత్ షా చెప్పారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా. ఇక్కడ పార్టీ బలోపేతం కోసం సీరియస్ గా పని చేయండి’’ అని నేతలకు నడ్డా సూచించారు. లీడర్ల మధ్య మంచి సమన్వయం, నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ల సమస్యలపై పోరాడితేనే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ బాగా స్ట్రాంగ్ అయిందన్నారు. ‘‘ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉద్యమించండి. టికెట్లు ఆశించి మాత్రం పని చేయకండి. అలా అయితే పార్టీలో భవిష్యత్తు ఉండదు” అని నేతలకు చెప్పారు. ‘‘స్వయంగా నేనే హైదరాబాద్ కు వచ్చి నిరసన ర్యాలీలో జాయిన్ అయి, కేసీఆర్ కు వ్యతిరేకంగా అంత స్ట్రాంగ్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడానంటే మీరు అర్థం చేసుకోవాలి.. టీఆర్ఎస్ సర్కార్ పై సెంట్రల్ పార్టీ పాలసీ ఎట్లుందో గుర్తించాలి. సంజయ్ అరెస్టుకు నిరసనగా, జీవో 317 సవరణకు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఆందోళనలో జాతీయ నేతలను పిలిపించి పాల్గొనేలా చేసిన తీరును మీరు అర్థం చేసుకోవాలి” అని ఆయన అన్నారు. అనంతరం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. జీవో 317 సవరణ కోసం తాను దీక్షకు దిగి అరెస్టయిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు. అదే విధంగా జాతీయ నాయకత్వానికి, ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇక ముందు కూడా టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు చేపట్టే ఆందోళనల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.