సాయుధ బలగాల నుంచి నాగాలాండ్​కు స్వేచ్ఛ!

సాయుధ బలగాల నుంచి నాగాలాండ్​కు స్వేచ్ఛ!

న్యూఢిల్లీ: ఎన్నో దశాబ్దాలుగా బలగాల బందోబస్తు మధ్య ఉన్న నాగాలాండ్​, అస్సాం, మణిపూర్​లకు స్వేచ్ఛ వచ్చింది. అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్​ఎస్​పీఏ)ని వెనక్కు తీసుకుంటున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ఏప్రిల్​ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ట్విట్టర్​లో వెల్లడించారు. ఏఎఫ్​ఎస్​పీఏ అధీనంలో ఉన్న ప్రాంతాలను తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడడం వల్ల వాటిని ఏఎఫ్​ఎస్​పీఏ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. కొన్నేండ్లుగా ప్రధాని మోడీ తీస్కుంటున్న చర్యల వల్ల అక్కడ తీవ్రవాదం తగ్గిందని, ప్రశాంత వాతావరణం ఏర్పడి ఇంతకుముందెన్నడూ ఎరుగని అభివృద్ధి కూడా జరుగుతోందని తెలిపారు. అయితే, ఆ మూడు రాష్ట్రాల నుంచి ఏఎఫ్​ఎస్​పీఏని పూర్తిగా వెనక్కు తీసుకోవడం లేదని, టెర్రరిజం ప్రభావం ఉన్న కొన్నిచోట్ల ఇంతకుముందున్నట్టే అది అమల్లో ఉంటుందని హోం శాఖ అధికారులు ప్రకటించారు. 2014తో పోలిస్తే ఇప్పుడు అక్కడ తీవ్రవాదం 74% తగ్గిందని అన్నారు. భద్రతా బలగాల మరణాలు 60%, ప్రజల మరణాలు 84 %  వరకు తగ్గాయన్నారు. చర్చలు ఫలించి ఇప్పటిదాకా 7 వేల మంది తిరుగుబాటుదారులు లొంగిపోయారని పేర్కొన్నారు. 

ఇదీ ఆ చట్టం కథ..

వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో అప్పట్లో టెర్రరిజం, చొరబాట్లు ఎక్కువగా ఉండేవి. దీంతో 1958 సెప్టెంబర్​ 11న అస్సాంలో నాడు భాగమైన నాగాహిల్స్​లో ఏఎఫ్​ఎస్​పీఏని తొలిసారి నాటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తర్వాత అస్సాం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్​ప్రదేశ్​, మిజోరాం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ దానిని విస్తరించింది.