చేపలు పట్టే అంశంపై మత్స్యకారులు, గ్రామస్తుల మధ్య గొడవ

చేపలు పట్టే అంశంపై మత్స్యకారులు, గ్రామస్తుల మధ్య గొడవ

అచ్చంపేట, వెలుగు:  నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ జిల్లా బల్మూర్​ మండలం కొత్తపల్లి( గణేశ్​ పూర్​) లో మంగళవారం సర్పంచ్​, పంచాయతీ సెక్రటరీల సస్పెన్సన్​ఎత్తి వేయాలని ఉప సర్పంచ్​తో పాటు, వార్డు నెంబర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని జల్కం చెరువులో చేపలు పట్టే అంశంపై కొన్నేండ్లుగా మత్స్యకారులు, గ్రామస్తుల మధ్య గొడవ జరుగుతోంది. చెరువుపై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉండడంతో ప్రభుత్వం వారివైపే మొగ్గు చూపింది. దీంతో గ్రామ పంచాయతీ సభ్యులు కోర్టుకు వెళ్లగా  న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై సొసైటీ సభ్యులు మరోసారి  కోర్టుకు వెళ్లగా చెరువుపై పూర్తి హక్కులు మత్స్యకార సొసైటీకి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులను సర్పంచ్​ మురళి, కార్యదర్శి నిరంజన్​ అమలు చేయకపోవడంతో నాగర్​కర్నూల్​ డీపీఓ ఈనెల 11న సర్పంచ్ ​మురళి, కారదర్శి నిరంజన్​లను సస్పెండ్​ చేశారు. దీనికి నిరసనగా ఉప సర్పంచ్​ హిమబిందుతో పాటు వార్డు మెంబర్లు కురుమయ్య, కురుమమ్మ, యాదమ్మ, మల్లికార్జున్, రాములు , వెంకటయ్య ​ఎంపీడీఓకు రాజీనామాలు సమర్పించారు. ఈ విషయమై ఎంపీడీఓ దేవన్నను వివరణ కోరగా రాజీనామా పేపర్లను డీపీఓకు పంపనున్నట్లు తెలిపారు.