నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద..583 అడుగులకు చేరిన నీటిమట్టం

నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద..583 అడుగులకు చేరిన నీటిమట్టం
  • నేటి నుంచి వరద కాల్వకు సాగునీటి విడుదల 

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా సాగర్​కు 92,976 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. మరో 7 అడుగులు(20 టీఎంసీలు) పెరిగినట్లయితే ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరకు 583 అడుగులు (291.1865)  టీఎంసీలు నీరు నిల్వ ఉంది.

 ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి సోమ లేదా మంగళవారం నాటికి సాగర్ డ్యాం క్రస్ట్​గేట్లను ఎత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం లోలెవల్ కెనాల్​(వరద కాల్వ)కు సోమవారం నుంచి ఇరిగేషన్​అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్​లో 575 అడుగులు దాటిన తర్వాత వరద కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. 

ఈ క్రమంలో వరద కాల్వకు ఖరీఫ్ సీజన్​లో పంట సాగుకోసం జిల్లాలోని సుమారు 50 వేల ఎకరాలకు 120 రోజులు సాగునీరు అందించడంతోపాటు సుమారు 80 చెరువులను నింపనున్నారు. సాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వకు 4,287 క్యూసెక్కులు, కుడి కాల్వకు 511 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 28,826 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కులు, 35,424 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో గా వదులుతున్నారు.