మీ అందరితో పంచుకోవడం హ్యాపీగా ఉంది: కుమారుడు అఖిల్ పెళ్లిపై నాగార్జున ట్వీట్

మీ అందరితో పంచుకోవడం హ్యాపీగా ఉంది: కుమారుడు అఖిల్ పెళ్లిపై నాగార్జున ట్వీట్

నటుడు అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీ మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం (జూన్ 6) తెల్లవారుజూమున హైదరాబాద్‎లోని నాగార్జున నివాసంలో అఖిల్ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అఖిల్ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, చిరంజీవి ఫ్యామిలీ, నటుడు శర్వానంద్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో తన కుమారుడు అఖిల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా నాగార్జున కీలక ప్రకటన చేశారు. 

‘‘నా కుమారుడు అక్కినేని అఖిల్ తన ప్రేయసి జైనాబ్‌ రవ్జీని మా ఇంట్లో (శుక్రవారం తెల్లవారుజామున 3:35 గంటలకు) వివాహం చేసుకున్నాడు. అమల, నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మాకు అత్యంత ఇష్టమైన సన్నిహితుల మధ్య  వారి కల నిజమైంది.  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న నా కొడుకు, కోడలికి మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము’’ అని నాగార్జున ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అఖిల్, జైనబ్‎కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

అఖిల్ వివాహం కొద్ది మంది సన్నిహితుల మధ్య జరగగా.. రిసెప్షన్ వేడుక మాత్రం ఆదివారం (జూన్ 8న) పెద్దఎత్తున జరగనుంది. ఈ ఈవెంట్కి భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార సహా పలు రంగాల ప్రముఖులు హాజరుకాన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు కూడా వచ్చే అవకాశం ఉంది.

జైనాబ్ ర‌వ్జీ బ్యాక్గ్రౌండ్:

అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ ర‌వ్జీ ముంబైకి చెందిన కళాకారిణి. స్వతహాగా పెయింటింగ్ ఆర్టిస్టు. ఇప్పటికే తన పెయింటింగ్స్తో హైదరాబాద్, ముంబయి, ఢిల్లి, లండన్, దుబాయ్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అంతేకాకుండా సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. 

ముంబైకు చెందిన పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ కుమార్తెనే జైనాబ్ రవ్జీ. ప్రస్తుతం జుల్ఫి రవ్జీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగంలో ప్రముఖ వ్యక్తిగా రాణిస్తున్నాడు. జైనాబ్ సోదరుడు జైన్ రావ్జీ, భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో 'ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు' ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. జైనాబ్ రవ్జీ ఫ్యామిలీకి బంజారాహిల్స్ రోడ్ నంబర్.7లో సొంత ఇల్లు కూడా ఉంది. 

జైనాబ్ తండ్రి జుల్ఫీ ర‌వ్జీ, హీరో నాగార్జున మంచి ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహమే అఖిల్, జైనాబ్ల ప్రేమకు మార్గం సుగమమైంది. ఇకపోతే హైద‌రాబాద్‌లో పుట్టిన జైనాబ్.. దుబాయ్‌లో పెరిగింది. అయితే, అఖిల్ కంటే తన భార్య జైనాబ్ 8 ఏళ్లు పెద్దది. ప్రస్తుతం అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా.. జైనాబ్‍ది 39 కావడం విశేషం. 

జైనాబ్ ర‌వ్జీ సినిమాలు:

అఖిల్ భార్య జైనాబ్ ఆర్టిసుగా రాణిస్తూనే సినిమాల్లో కూడా నటించింది. ఎంఎఫ్ హుస్సేన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే బాలీవుడ్‌ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో జైనాబ్ క‌నిపించింది. ప్రస్తుతం జైనాబ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ప్రైవేట్లో ఉంచడం గమనార్హం!