పర్యాటకులను ఆకట్టుకుంటోన్న బుద్ధవనం

పర్యాటకులను ఆకట్టుకుంటోన్న బుద్ధవనం

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్​ తీరంలో 274 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బుద్ధవనం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మే 14న రాష్ట్ర ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టును ఓపెన్ చేసింది. అప్పటి నుంచి పర్యాటకుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోని నలమూలల నుంచే కాకుండా వియత్నాం, కొరియా దేశాల నుంచి కూడా బౌద్ధ మతస్తులు, టూరిస్టులు బుద్ధవనాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకోవాలనే ఆలోచనతో ఇప్పటికైతే ప్రభుత్వం ఉచితంగానే ప్రవేశం కల్పిస్తోంది. పర్యాటకుల రద్దీ పెరగడంతో ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో హామీ ఇచ్చిన పలు దేశాల నుంచి నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. అదేవిధంగా త్వరలో ఎంట్రీ ఫీ పెట్టాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

నాలుగింతలు పెరిగిన రద్దీ

బుద్ధవనం ప్రాజెక్టు ఓపెన్ చేయడానికి ముందు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు, ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు లాంచీలో ప్రయాణం సాగించేందుకు సీజన్, అన్​ సీజన్​లో కలిపి నెలకు నాలుగు వేల మంది పర్యాటకులు వచ్చేవారు. బుద్ధవనం ఓపెన్ అయ్యాక పర్యాటకుల రద్దీ 17 వేలకు పెరిగింది. శని, ఆదివారాల్లో అయితే రోజుకు వెయ్యి, రెండు వేల మంది వరకు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. టూరిజం డిపార్ట్​మెంట్ ​పరిధిలోని విజయ విహార్ గెస్ట్​హౌజ్​తోపాటు ప్రాజెక్టు పరిధిలోని ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లు కళకళలాడుతున్నాయి. నెలకు సుమారు వేయి, రెండు వేల మంది టూరిస్టులు నైట్ స్టే చేస్తున్నారు. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో బుద్ధవనం అభివృద్ధికి పలు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ సంస్థ బుద్దిష్ట్ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. తైవాన్​కు చెందిన ఫోగౌంగ్ షాన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు బుద్ధిష్ట్ మోనాస్టిక్ ఎడ్యుకేషన్ సెంటర్ ​కోసం రూ.64.10 కోట్లు, బెంగళూరుకు చెందిన మహాబోధి సొసైటీ బౌద్ధ సన్యాసుల ఆశ్రమ నిర్మాణానికి రూ.20.49 కోట్లు  పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. న్యూఢిల్లీకి చెందిన లోటస్ నిక్కో హోటల్స్ రూ. 42 కోట్ల పెట్టుబడితో బడ్జెట్​హోటల్స్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 

ఆకట్టుకుంటున్న కట్టడాలు

బుద్ధవనంలో నిర్మించిన కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం 274 ఎకరాలు కేటాయించగా 90 ఎకరాల్లో వివిధ నిర్మాణాలను చేపట్టారు. దేశ, విదేశాలకు సంబంధించిన 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలు, భారతదేశంతోపాటు దక్షిణాసియాలోని వివిధ దేశాల కు చెందిన 13 బౌద్ధ స్తూపాల నమూనాలు, వంద అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్తూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించారు. శ్రీలంక నుంచి తీసుకొచ్చిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ ఏర్పాటు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన మల్వాల రాయితో ఇక్కడి  శిల్పాలను చెక్కారు. బుద్ధవనంలోకి ప్రవేశించే 3 ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వాడారు. బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉండడంతో ఇక్కడ వాటిని పెంచుతున్నారు. సిద్ధార్థుడు ఆహారం, నీళ్లు తీసుకోకుండా 48 రోజులపాటు కఠోర తపస్సు చేసి, హృదేలా గ్రామంలో సుజాతాదేవి ఇచ్చిన పాయసం స్వీకరించిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ వృత్తాంతాన్ని ప్రతిబింబించేలా మహాస్తూపం కిందిభాగంలో మోకాళ్ల మీద కూర్చుని పాయసం తీసుకున్నట్లు ప్రతిమను చెక్కారు. కాంక్రీట్‌తో నిర్మించిన స్తూపాల్లో ఆసియా ఖండంలోనే ఇదే అతి పెద్దది. ఈ స్తూప నిర్మాణానికి గుంటూరు జిల్లా అమరావతిలోని శాతవాహునుల కాలంలో నిర్మించిన స్తూపం కొలతలను తీసుకున్నారు. విశాలమైన ధ్యాన మందిరం, లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం కూడా ఉన్నాయి.