ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే సహించం : కలెక్టర్ బాధావత్ సంతోష్

ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే సహించం : కలెక్టర్ బాధావత్ సంతోష్
  • నాగర్ కర్నూల్ కలెక్టర్ బాధావత్ సంతోష్
  •     వెన్నచర్ల పీహెచ్​సీలో కలెక్టర్ తనిఖీ
  •     విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌‌‌‌‌‌‌‌పై వేటు

కోడేరు, వెలుగు : వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించి  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్​ డాక్టర్లను హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల పీహెచ్​సీని గురువారం కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ నమోదు, ల్యాబొరేటరీ, ప్రసూతి విభాగం, మందుల పంపిణీ కేంద్రాలను పరిశీలించారు.

రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులకు వైద్య పరీక్షలు, చిన్నారులకు టీకాలు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణలో పరిశుభ్రత పాటించాలని, సిబ్బంది హాజరు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు. 

విధులకు గైర్హాజరు.. డాక్టర్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలని ఆదేశం

వైద్యులు వారంలో నాలుగు రోజులు విధులకు రావడం లేదని, పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని గ్రామస్తులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఫోన్ ద్వారా డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ఓను ఆదేశించారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. 

ఈవీఎం గోడౌన్​ తనిఖీ

కందనూలు, వెలుగు: ప్రతినెలా నిర్వహించే ఈవీఎం గోడౌన్​ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ఈవీఎం గోడౌన్​ను గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను పరిశీలించారు. గోడౌన్​వద్ద ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ నివేదికల రిజిస్టర్ లో కలెక్టర్ సంతకాలు చేశారు. ఈ తనిఖీల్లో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రవికుమార్, డీటీ కల్పన, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలకృష్ణ, ఎండీ హుస్సేన్ పాల్గొన్నారు.