అమ్రాబాద్: అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి మహిళ మృతి

అమ్రాబాద్: అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి మహిళ మృతి

అమ్రాబాద్, వెలుగు: అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి ఓ మహిళ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  లింగాల మండలం బౌరపూర్​ గ్రామానికి చెందిన కాంట్రాజు ఈదమ్మ (40) అమ్రాబాద్​ మండలం ఫర్హాబాద్ గేట్ సమీపంలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తుండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

గత ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో మహిళా సంఘంలో తీసుకున్న అప్పులు చెల్లించలేక, కుటుంబ పోషణ భారమై సోమవారం మల్లాపూర్ సమీపంలోని మక్కలేటి ఇరుపుల వాగు సమీపంలో విస్తరాకుల (మార్పుటాకు) సేకరణకు మరో ముగ్గురితో కలిసి ఈదమ్మ వెళ్లింది. విస్తరాకులు తెంచుతుండగా దరి నుంచి జారి ఆమె లోయలో పడిపోయిందని వెంట వెళ్లినవారు చెబుతున్నారు. కాగా, ఈదమ్మ భర్త  ఐదేండ్ల కింద ఫారెస్ట్ వాచర్ గా చేస్తూ మృతి చెందడంతో భార్యకు స్వీపర్ గా అవకాశం కల్పించారు. కానీ ఫారెస్ట్ అధికారులు సకాలంలో వేతనాలు ఇవ్వలేదని, దీంతో కుటుంబ పోషణ కోసం అడవికి వెళ్లి ఈదమ్మ లోయలో పడిపోయి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో రావాల్సిన రూ. కోటి ఇన్సూరెన్స్ ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, ఈదమ్మ ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, 108 సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.