ఎలుకలు కొరికి పేషెంట్లు చనిపోతే ఎందుకు స్పందించలే : నాయిని రాజేందర్‍రెడ్డి

ఎలుకలు కొరికి పేషెంట్లు చనిపోతే  ఎందుకు స్పందించలే : నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ ఎంజీఎంలో హస్పిటల్లో ఎలుకలు కొరికి పేషెంట్లు చనిపోతే పట్టించుకోని యువరాజు కేటీఆర్‍,   ఎంజీఎంలో కరెంట్​ పై  తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి మండిపడ్డారు. గురువారం హనుమకొండ కాంగ్రెస్‍ భవన్​లో  ఆయన ప్రెస్​మీట్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఎంజీఎంలో కరెంట్‍ పోయిన విషయాన్ని భూతద్దంలో చూపిస్తున్న కేటీఆర్‍ 10 ఏండ్లపాటు అదే ఎంజీఎంలో రిటైర్మెంట్లు తప్పితే రిక్రూట్‍మెంట్లను పట్టించుకోలేదన్నారు. 

పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంవల్ల కోట్ల   రూపాయల పరికరాలు  వాడకుండానే తుప్పుపట్టిన విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. రూ.700 కోట్ల కమిషన్‍ కోసమే సెంట్రల్‍ జైల్‍ను కూల్చి భూములను బ్యాంక్‍ ఆఫ్‍ మహారాష్ట్రలో తాకట్టు పెట్టారని ఆరోపించారు.  ఎంజీఎం అభివృద్ధిని పక్కనపెట్టి.. 24 అంతస్తుల హస్పిటల్‍ పేరుతో డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు. మెగా టెక్స్​టైల్​   పేరుతో రైతుల భూములు గుంజుకుని వారి నోట్లో మట్టి కొట్టారన్నారు. గ్రేటర్ వరంగల్లో కేసీఆర్‍ ప్రభుత్వం పదేండ్లలో శంకుస్థాపనలు తప్ప చేసిందేమిలేదని విమర్శించారు.

 నిధులున్నా అప్పటి గ్రేటర్‍ ఎమ్మెల్యే లు  వినియోగించుకులేదని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఎంజీఎంలో కరెంట్‍ పోయినా.. జనరేటర్లతో సేవలు అందించామని.. సీఎం రేవంత్‍రెడ్డి తిరుపతి దైవదర్శనంలో ఉన్నా చర్యల కోసం స్పందించారని చెప్పారు. అయినప్పటికీ ఘటనపై చర్యలు తీసుకునేందుకు విచారణ చేస్తున్నామన్నారు. ఎంజీఎం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్‍, రాములు, మామిండ్ల రాజు, చీకటి శారద ఆనంద్‍, నేతలు పుప్పాల ప్రభాకర్‍ వీరగంటి రవీందర్‍,  బొమ్మతి విక్రమ్‍   పాల్గొన్నారు.