V6 News

నన్ను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు : కోమటిరెడ్డి బ్రదర్స్పై చిరుమర్తి సంచలన ఆరోపణలు

నన్ను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు : కోమటిరెడ్డి బ్రదర్స్పై చిరుమర్తి సంచలన ఆరోపణలు

నల్లగొండ జిల్లా : కోమటిరెడ్డి బ్రదర్స్ పై నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య సంచలన ఆరోపణలు చేశారు. నకిరేకల్ మండలంలోని పాలెం, నోముల గ్రామాల్లో చిరుమర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ బ్రోకర్లు అని, ప్రజలు వాళ్లకు సమాధి కడుతారని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలో కొంతమంది నాయకులను డబ్బులతో కొంటున్నారని ఆరోపించారు. తనను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో తనకు ప్రాణ హాని ఉందని, ప్రజలే తనను కాపాడుకుంటారని చెప్పారు. 

తనకు ప్రాణహాని ఉండడంతో ఇంటెలిజెంట్స్ రిపోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం తమకు సెక్యూరిటీని పెంచిందన్నారు చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ నియోజకవర్గంలో శనివారం (నవంబర్ 4వ తేదీ) నుండి ప్రచారం చేయనని, కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి కోసం నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. 

బొడ్డుపల్లి శ్రీనుని వేముల వీరేశం, కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసే హత్య చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. 2014లో తాను ఓడిపోవడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కారణమన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. దళితుడైన తనను ఓర్వలేక.. ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.