నా భూమిని విడిపించాలని మల్యాల ఎస్సైకి రూ. 3 లక్షలు ఇచ్చా: నక్క అనిల్

నా భూమిని విడిపించాలని మల్యాల ఎస్సైకి రూ. 3 లక్షలు ఇచ్చా: నక్క అనిల్

తన భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మల్యాల మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన నక్క అనిల్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం తనకు ఇచ్చిన 20 గుంటల భూమిని కబ్జా చేశారని, ఈ విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగడం లేదంటూ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. కబ్జాదారుల నుంచి తన 20 గుంటల భూమిని విడిపించాలని కోరుతూ మల్యాల ఎస్ఐ చిరంజీవికి రూ.3లక్షల లంచం కూడా ఇచ్చానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తన భూమిని ఎస్ఐ చిరంజీవి ఇప్పించకపోగా ..డబ్బులు తిరిగి ఇవ్వమంటే అక్రమంగా ఏడు కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

తనపై అక్రమ కేసులు పెట్టిన ఎస్ఐ చిరంజీవి.. మానసికంగా, ఆర్థికంగా  ఇబ్బందులకు గురి చేశాడని నక్క అనిల్ సెల్ఫీ వీడియోలో బోరున విలపించాడు. మరోసారి తనను డబ్బులు అడిగినా...పై అధికారులకు విషయాన్ని చెప్పినా..పీడీ యాక్ట్ కేసు పెడతామని ఎస్ఐ చిరంజీవి బెదిరించాడని వెల్లడించాడు. ఎస్ఐ చిరంజీవి వేధింపుల వల్లే తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు తెలిపాడు. తనకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారని, వారికి న్యాయం చేయాలని కోరాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అనిల్ కోసం వెతుకుతున్నారు.