నల్గొండ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు :  సీఎం కేసీఆర్‌‌ దత్తత పేరుతో నల్గొండ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.  సోమవారం క్యాంపు ఆఫీస్‌లో పానగల్​తో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్‌‌ రాష్ట్రాల్లో చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.  కేసీఆర్‌‌కు రోజులు దగ్గరపడ్డాయని,  ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందనే ఆందోళనతో నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికి కేసీఆర్‌‌ కొత్త నాటకం ఆడుతున్నాడని విమర్శించారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. ప్రధాని మోదీ అందరి అకౌంట్లలో రూ.  15 లక్షలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  ఏప్రిల్, మే నెలలో జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు.  నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  

ఆరు గ్యారెంటీ స్కీంలతో  పేదల బతుకులు మారుతాయని, ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ  కార్యక్రమంలో  పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్, మాడుగులపల్లి జడ్పీటీసీ సైదులు, మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్, గుండగోని నాగయ్య, వెంకట్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.