గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
  • హాస్టల్ భవనం పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలు  
  • కండ్లు తిరిగి పడిందన్న ఆర్​సీవో
  • నల్గొండ జిల్లా కేంద్రంలో ఘటన  

నల్గొండ అర్బన్,  వెలుగు : నల్గొండలో మంగళవారం గురుకుల హాస్టల్ స్టూడెంట్​హాస్టల్ భవనంపై నుంచి దూకి  ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ గాంధీ హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. అయితే, విషయం బయటకు రాకుండా కాలేజీ సిబ్బంది జాగ్రత్త పడ్డారు. నల్గొండలోని 11వ వార్డు మామిళ్లగూడానికి చెందిన కోరె వెన్నెల జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ(శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్​  కెనాల్) లో ఉన్న గంధవారిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ ఫస్టియర్​చదువుతోంది. 

సోమవారం రాత్రి అందరు విద్యార్థులు పడుకున్న తర్వాత వెన్నెల ఉండే హాస్టల్​బిల్డింగ్ మూడో ఫ్లోర్​నుంచి ​దూకింది. దీంతో తీవ్రంగా గాయపడగా చూసిన తోటి విద్యార్థులు వార్డెన్​కు చెప్పారు. వారు ప్రిన్సిపాల్ కు చెప్పి వెంటనే దవాఖానకు తరలించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఉదయం దవాఖానలో ఉన్న కూతురిని చూసి ఏమైందో కనుక్కుందామని సరాసరి హాస్టల్​కు చేరుకున్నారు. అయితే, వారిని లోపలకు రానివ్వకపోవడంతో గొడవ చేయడంతో విషయం బయటకు పొక్కింది. కాగా విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. 

ఘటన గురించి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆర్​సీవో అరుణకుమారి ని  వివరణ కోరగా వెన్నెల బిల్డింగ్​పై నుంచి కండ్లు తిరిగి కింద పడడంతో తమ సిబ్బంది  ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారని చెప్పారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యాయత్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కేవీపీఎస్​జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్​చేశారు. కాలేజీ యజమాన్యంపై  చర్యలు తీసుకొని స్టూడెంట్​కు మెరుగైన వైద్యం అందించాలని  కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు.