
- టెస్టుల్లో పాసైన వారికి లైసెన్స్ ఇవ్వనున్న ప్రభుత్వం
- ఉమ్మడి జిల్లాలో 500 మంది దరఖాస్తు
- త్వరలో పరిష్కారం కానున్న భూ సమస్యలు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్వరలోనే సర్వేయర్ల కొరత తీరనుంది. అర్హత కలిగిన ప్రైవేట్ సర్వేయర్లతోపాటు కొత్త వారికి ట్రైనింగ్ ఇచ్చి, లైసెన్స్ జారీ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో వీరి సేవలను ఉపయోగించుకొని, భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 500 మందికి ఈ నెల 26 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.
భూసేకరణ పెండింగ్
ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 33 మండలాల పరిధిలో 17 మంది ప్రభుత్వ, ముగ్గురు డిప్యూటీ, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మందే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా 15 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. సర్వేయర్ల కొరతతో ప్రభుత్వం వివిధ పథకాల కింద చేయాలనుకున్న భూసేకరణను పెండింగ్పెట్టాల్సి వస్తోంది.
మరోవైపు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా అనేక రకాల భూ సమస్యలు తలెత్తాయి. ఒకరి భూమి మరొకరికి పేరిట రావడంతో హద్దులు లేకుండా పోయాయి. దీంతో చాలా మంది భూసర్వేకు అప్లై చేసుకున్నారు. అదే విధంగా అగ్రికల్చర్ భూములు కూడా రియల్ ఎస్టేట్‌గా మారిపోతున్నాయి. ఈ క్రమంలో నాలా కన్వర్షన్ కోసం భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. సర్వేయర్ల కొరతతో భూముల సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం అర్హత కలిగిన వారికి ట్రైనింగ్ ఇస్తుండటంతో సమస్య తీరనుంది.
17 వరకు అప్లై చేసుకున్నవారికి అవకాశం
భూభారతి అమలులో భాగంగా రాష్ట్రంలో 5 వేల మందికి సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అర్హత కలిగిన వారు ఈ నెల 17 వరకు మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పాత సర్వేయర్లతోపాటు 60 శాతం మార్కులతో గణితం సబ్జెక్టుగా ఇంటర్ పూర్తయినవారు, ఐటీఐ (డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్), డిప్లొమా, బీటెక్ సివిల్ చేసినవారిని అర్హులుగా సర్కార్ ప్రకటించింది. దరఖాస్తుదారులకు ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు నెల రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. నల్లగొండ జిల్లాలో 200 మంది, సూర్యాపేట జిల్లాలో 150 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 150 మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మూడు అంశాల్లో శిక్షణ..
అభ్యర్థులకు థియరీ, టిప్పన్ ప్లాటింగ్, ఫీల్డ్ విషయాల్లో శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత 40 రోజులపాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అనంతరం జిల్లాస్థాయిలో వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు. అది పాసైతే లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినవారు సర్వే చేసేందుకు అర్హులు. వారు చేసే సర్వేకు అధికారిక గుర్తింపు ఉంటుంది.