తెలంగాణలో నేను పెద్ద ఉద్యమకారుడిని : నామా నాగేశ్వరరావు

తెలంగాణలో నేను పెద్ద ఉద్యమకారుడిని : నామా నాగేశ్వరరావు

పార్లమెంట్ లో తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తానని చెప్పారు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేతగా ఎన్నికైన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. గతంలో ఐదేళ్లపాటు పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. తాను లోక్ సభ పక్షనేతగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా పార్లమెంట్ లో ఉన్నారని గుర్తుచేశారు. గతంలో చూశారు కాబట్టే.. ఇపుడు ఆ బాధ్యతలు ఇచ్చారని అన్నారు. పార్టీ లైన్ లో పార్లమెంట్ లో అందరినీ కలుపుకుపోతానని చెప్పారు నామా.

ఖమ్మంలో ఓ ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వలేదు అని ఓ ఆరోపణ ఉంది.. దీనిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు నామా నాగేశ్వరరావు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “నేను తెలంగాణలో పెద్ద ఉద్యమకారుడికిందే లెక్క. 15వ లోక్ సభ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు మొదటి ఓటు వేసింది నేనే. తెలంగాణ బిల్లుపై ఓటేసే అదృష్టం నాకు కలిగింది. మొదటి నుంచి కూడా నేను తెలంగాణ బిడ్డను. తెలంగాణ వాదిని. అన్నీ చూసే ఖమ్మంలో నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. జనం కూడా నన్ను గెలిపించారు” అన్నారు నామా నాగేశ్వరరావు.