హైదరాబాద్, వెలుగు : గ్రాసరీ, రెస్టారెంట్ బిజినెస్‌లు చేసే బెంగళూరుకు చెందిన నామ్‌ధారీస్ గ్రూప్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇంకో రెండేళ్లలో సిటీలో రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ప్రొడక్షన్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సిటీలో ఐదు సింప్లి నామ్‌ధారీస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లను అందుబాటులోకి తెస్తుంది. సింప్లి నామ్‌ధారీస్ స్టోర్‌లలోని క్విక్ సర్వీస్ రెస్టారెంట్లలో (క్యూఎస్ఆర్) తాజా కూరగాయలతో ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. హైదరాబాద్‌లో పలుచోట్ల స్టాండ్-ఎలోన్ క్యూఎస్ఆర్ ఫుడ్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ‘‘వీటన్నింటి కోసం రూ.50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం. మా సింప్లీ ఫుడ్ స్టోర్స్‌లో ఆరోగ్యకరమైన, రుచికరమైన షార్ట్ ఈట్స్ శ్నాక్స్‌ను అమ్ముతాం. చందా విధానంలో సేంద్రియ పాలనూ డెలివరీ చేస్తాం. నామ్‌ధారి సీడ్స్ పేరుతో విత్తనాలనూ అమ్ముతున్నాం. కిరాణా సామాగ్రి, పండ్లు కూరగాయలు, రుచికరమైన వంటకాలు, చిరుతిళ్లు అన్నింటినీ ఒకేచోట అందుబాటులోకి తెస్తాం” అని నామ్‌ధారీస్ గ్రూప్ సీఈవో గుర్‌ముఖ్ రూపా తెలిపారు.
