నమో మంత్రం: పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్

నమో మంత్రం: పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్

మళ్లీ నమో మోడీ మంత్రం ఫలించింది. మార్కెట్ మురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో స్టాక్ సూచీలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిలను అందుకున్నాయి. మొట్టమొదటిసారి  సెన్సెక్స్ 40వేల మార్క్‌‌‌‌ను, నిఫ్టీ 12 వేల మైలురాయిని చేధించి రికార్డు సృష్టించాయి.  ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి పగ్గాలు చేపట్టేలా సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్‌‌‌‌ విడుదల కావడంతో మార్కెట్‌‌‌‌ జోరందుకుంది. కౌంటింగ్‌‌‌‌ ప్రారంభంలోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ వచ్చే దిశగా ఫలితాలు విడుదలవడంతో మార్కెట్ ఓపెనింగ్‌‌‌‌లోనే హై రేంజ్‌‌‌‌లో జంప్ చేసింది. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 39,591.77 వద్ద ప్రారంభమైంది. అదే ఊపులో కొనసాగిన సెన్సెక్స్ 40,124.95 వద్ద ఆల్ టైమ్ హైను చేరుకుంది. నిఫ్టీ కూడా అదే రేంజ్‌‌‌‌లో లాభపడి 12,041 వద్ద రికార్డు స్థాయిని తాకేసింది. కానీ ఈ గరిష్ట స్థాయిల వద్ద మార్కెట్ ఎంతో సేపు నిలబడలేకపోయింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌‌‌‌కు ఎగబడటంతో సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ రెండూ కిందకి జారాయి. చివరికి కూడా మార్కెట్లు నష్టాలతోనే ముగించాయి. సెన్సెక్స్ 299 పాయింట్ల నష్టంలో 38,811.39 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల నష్టంలో 11,657 వద్ద స్థిరపడ్డాయి. ఎఫ్‌‌‌‌ఎంసీజీ, మెటల్స్, ఐటీ షేర్లలో బాగా అమ్మకాలు చోటు చేసుకుని, నష్టాలు పాలయ్యాయి.

ఫలితాల విడుదల రోజు సెన్సెక్స్ ప్యాక్‌‌‌‌లో హీరో మోటోకార్ప్‌‌‌‌, కోల్ ఇండియా, యస్‌‌‌‌ బ్యాంక్, పవర్‌‌‌‌‌‌‌‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్, ఎల్‌‌‌‌ అండ్ టీ, కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ల షేర్లు లాభాలు పండించాయి. ఇండస్‌‌‌‌ ఇండ్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్‌‌‌‌‌‌‌‌గా 5.23 శాతం లాభపడింది. వేదంతా, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్, సన్​ ఫార్మా, టాటా స్టీల్, టీసీఎస్‌‌‌‌, ఓఎన్‌‌‌‌జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.

దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్‌‌‌‌ అంచనాల మాదిరిగానే ఫలితాలు విడుదల కావడంతో, ట్రేడింగ్‌‌‌‌ ప్రారంభంలో మార్కెట్‌‌‌‌లో ఫలితాల సందడి కనిపించింది. కానీ గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు, రూపాయి విలువ పడిపోవడం దానికి తోడు ప్రాఫిట్ బుకింగ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ను నష్టాల బాట పట్టించింది.

2014 ఫలితాల కౌంటింగ్‌‌‌‌ రోజు ఇదే హిస్టరీ….

2014 మే 16న సెన్సెక్స్ ఇదే హిస్టరీని సృష్టించింది.2014 లోక్‌‌‌‌సభ ఎన్నికల కౌంటింగ్‌‌‌‌ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ రావడంతో సెన్సెక్స్ మొట్టమొదటిసారి 25 వేల మార్క్‌‌‌‌ను తాకి రికార్డు బద్దలు కొట్టింది. సెన్సెక్స్‌‌‌‌ ఆ రోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే 1,470 పాయింట్లు ఎగిసి లైఫ్ టైమ్ హై 25,375 ను చేరుకుంది. బీజేపీ ప్రభుత్వం చేపడుతోన్న వేగవంతమైన సంస్కరణలు, ఆర్థిక కార్యకలాపాలను పుంజుకునేలా చేస్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఆ రోజు కూడా ఇదే మాదిరి బాగా ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుని లాభాలను కాస్త తగ్గించుకుని 216 పాయింట్ల లాభంతో 24,121 వద్ద క్లోజైంది.

ఇన్వెస్టర్ల సంపద జూమ్…

ఈక్విటీ మార్కెట్ సరికొత్త గరిష్టాలను తాకడంతో, ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా పెరిగింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో ఇన్వెస్టర్ల సంపద రూ.2.87 లక్షల కోట్లు ఎగిసింది. మార్కెట్ ఆల్‌‌‌‌టైమ్ హైలకు చేరుకున్నప్పుడు బీఎస్‌‌‌‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌‌‌ రూ.2,87,028.8 కోట్లు పెరిగి రూ.1,53,56,153.14 కోట్లకు చేరుకుంది. బుధవారం ఈ మార్కెట్ క్యాప్ రూ.1,50,69,124.34 కోట్లుగా ఉంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే అన్ని టీవీ ఛానళ్లు ఎన్డీయేనే మళ్లీ అధికారం చేపట్టనుందని పేర్కొన్నాయి.

రూ.75.25 లక్షల కోట్లు పెరిగిన స్టాక్ మార్కెట్ సంపద…

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ సంపద రూ.75.25 లక్షల కోట్లు పెరిగింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 61 శాతం పెరిగింది. స్టాక్‌‌‌‌ మార్కెట్ మూవ్‌‌‌‌మెంట్ అనాలసిస్ ప్రకారం 2014 మే 16 నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్‌‌‌‌ 14,689.65 పాయింట్లు లేదా 60.89 శాతం ఎగిసింది. దీంతో బీఎస్‌‌‌‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ మొత్తంగా అప్పటి నుంచి రూ.75.25 లక్షల కోట్లు పెరిగి, గురువారం ట్రేడింగ్ చివరి నాటికి రూ.150.25 లక్షల కోట్లకు చేరుకుంది.