బషీర్బాగ్, వెలుగు: ఐబొమ్మ పైరసీ కేసులో రవిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నట్టు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ఇమ్మడి రవిని గురువారం ఉదయం జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఇమ్మడి రవిని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసులో కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆ కేసులో కోర్టు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇప్పటివరకు రవి పై మొత్తం ఐదు కేసులు నమోదైనట్టు సమాచారం. తాజాగా మరో కేసులో రిమాండ్ విధించగా, మిగిలిన మూడు కేసుల్లో కూడా పీటీ వారెంట్ వేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, కోర్టు అనుమతి పొందిన వెంటనే ఆ కేసుల్లో కూడా అరెస్ట్ చూపనున్నారు.
