
హైదరాబాద్:మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. కొంపల్లిలోని నాంపల్లి కోర్టు మెజీస్ట్రేట్ కన్యాలాల్ ముందు ప్రణీత్ ను హాజరుపరుచగా.. రిమాండ్ విధించారు. ఇప్పటికే కేసు విచారణ కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు.
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఆయన్ను సిరిసిల్లాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చిన అధికారులు...కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో టీంను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు.. ఎవిడెన్స్ ధ్వంసం చేశారని నిర్ధారణ కావడంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
ప్రణీత్ రావు అరెస్ట్ సమయంలో ఆయన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు...కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాడిన ఫోన్, సిమ్ లను స్వాధీనం చేసుకుని..డేటా రిట్రైవ్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు SIB కార్యాలయంలో ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో నుంచి కొంత డేటా రికవరీ అయినట్లు తెలుస్తోంది. కొన్ని లక్షల కాల్ రికార్డింగ్స్ అన్నింటిని సేవ్ చేసినట్లు పోలీసుల విచారణ లో తేలింది.
ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రణీత్ కీలక పాత్ర పోషించినట్లు అధికారుల అనుమానిస్తున్నారు. పార్టీలకు ఫండింగ్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కాల్ రికార్డింగ్ సైతం ప్రణీత్ సిస్టంలో ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు హైదరాబాదులోని రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును స్పెషల్ బృందాలు విచారిస్తున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ప్రణీత్ వెనకాల ఉండి కథ నడిపించిన అధికారుల పాత్ర పైన ప్రస్తుత దర్యాప్తు సంస్థలు విచారణ చేయనున్నాయి. అయితే పోలీసుల విచారణకు ప్రణీత్ రావు ఎంతవరకు సహకరిస్తాడు అనేది వేచి చూడాలి. ఎప్పుడు లేని విధంగా మొదటిసారి టెలిగ్రాఫ్ ఆక్ట్ ను ఒక అధికారి పైన పెట్టారు. కాబట్టి కోర్టులో ఈ కేసు నిలబడాలంటే పగడ్బందీ సాక్షాదారాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది.
ప్రణీత్ రావు అరెస్టుతో అలర్ట్ అయిన పలువురు మాజీ అధికారులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అతని టీం లో ఉన్న 30 మంది సభ్యులను ఇప్పటికే ప్రత్యేక బృందం గుర్తించింది. వారి పై సైతం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.