వినియోగంలోకి నాంపల్లి మెట్రో మల్టీ లెవల్ పార్కింగ్... దేశంలోనే తొలి ఆటోమేటెడ్ హైటెక్ పార్కింగ్

వినియోగంలోకి నాంపల్లి మెట్రో మల్టీ లెవల్ పార్కింగ్... దేశంలోనే తొలి ఆటోమేటెడ్ హైటెక్ పార్కింగ్
  •     ప్రారంభించనున్న  మంత్రి పొన్నం ప్రభాకర్
  •     జర్మన్ టెక్నాలజీతో నిర్మాణం.. సినిమా థియేటర్లు కూడా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీ నడిబొడ్డున వాహనదారులు పడుతున్న పార్కింగ్ తిప్పలకు ఇయ్యాల్టితో తెరపడనుంది. నాంపల్లిలో అత్యంత ఆధునిక హంగులతో నిర్మించిన మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ శనివారం ప్రారంభం కానుంది. ఈ హైటెక్ పార్కింగ్ సెంటర్‌‌ ను రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. 

దేశంలోనే మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయి ఆటోమేటెడ్ పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టు.. నగర వాసులకు ఇంటర్నేషనల్ పార్కింగ్ అనుభూతిని ఇవ్వబోతోందని అధికారులు చెబుతున్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు హాజరుకానున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.

అంతా రోబోటిక్ స్టైల్.. డ్రైవర్ అవసరం లేదు

హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మనుషుల ప్రమేయం ఉండదు. జర్మనీకి చెందిన పాలిస్ టెక్నాలజీతో దీనిని నిర్మించారు. ఇది దేశంలోనే ఫస్ట్ ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ సిస్టమ్. డ్రైవర్ కారును టెర్మినల్ దగ్గర పెట్టి కార్డు స్వైప్ చేస్తే చాలు.. సెన్సార్ల సాయంతో కారు సైజును బట్టి సిస్టమే ఆటోమేటిక్‌‌గా లిఫ్ట్ చేసి ఖాళీ ఉన్న ఫ్లోర్‌‌లో పార్క్ చేస్తుంది. 

తిరిగి వచ్చేటప్పుడు కూడా కార్డు స్వైప్ చేయగానే కారు మన ముందుకు వస్తుంది.  దాదాపు 2 వేల చదరపు గజాల స్థలంలో రూ.102 కోట్ల పెట్టుబడితో నోవమ్ సంస్థ ఈ కాంప్లెక్స్‌‌ ను నిర్మించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఢిల్లీ, ముంబైలో ఉన్నవాటి కంటే ఇది చాలా అడ్వాన్స్‌‌డ్ అని, 360 డిగ్రీల టర్న్ టేబుల్ ఉండటంతో కారును ఎలా పార్క్ చేసినా సిస్టమ్ సరిగ్గా సెట్ చేస్తుందని అధికారులు తెలిపారు.

పార్కింగ్, వినోదం

మొత్తం 15 అంతస్తులున్న ఈ భారీ భవనంలో 10 అంతస్తులు పార్కింగ్‌‌కు కేటాయించారు. ఒకేసారి 250 కార్లు, 200 బైకులు పార్క్ చేయొచ్చు.  ఇందులో రెండు సినిమా థియేటర్లు, షాపింగ్ కోసం కమర్షియల్ స్పేస్ ఉంది. 11వ అంతస్తులో సిటీ అందాలను చూసేందుకు  ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.