మొయినాబాద్ ఫాం హౌస్  కేసు: నిర్మాణాల కూల్చివేతపై అధికారులను నిలదీసిన నందకుమార్ భార్య

మొయినాబాద్ ఫాం హౌస్  కేసు: నిర్మాణాల కూల్చివేతపై  అధికారులను నిలదీసిన నందకుమార్ భార్య

మొయినాబాద్ ఫాం హౌస్  కేసులో అరెస్టయిన నందకుమార్  ఫిల్మ్ నగర్ ఏరియాలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. అయితే  కూల్చివేత ప్రక్రియను అడ్డుకునేందుకు  నందకుమార్  భార్య చిత్రలేఖ యత్నించారు.  కూల్చివేతలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను నిలదీశారు. ఎందుకు కూల్చివేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.  అయితే GHMC అధికారులు దీనికి బదులివ్వకుండా మొహం చాటేశారని  నందకుమార్ భార్య ఆరోపించారు. కూల్చివేతకు అనుమతించే నోటీసులు చూపించమని అడిగితే .. తమకు తెలియదని అధికారులు బదులిచ్చారని చెప్పారు.

 

అధికారులు ఏమంటున్నారు ?

నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్.. డెక్కన్ హోటల్ కిచెన్ కోసం రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే వాటిని కూల్చి వేయించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత ప్రక్రియ నిర్వహించారు. కోర్టు ఆదేశాలతోనే తాము అక్రమ నిర్మాణాలను కూల్చివేయించామని అధికారులు అంటున్నారు.