కొండల్లో బైక్‌పై నారా బ్రాహ్మణి రైడింగ్ 

కొండల్లో బైక్‌పై నారా బ్రాహ్మణి రైడింగ్ 

నారా బ్రాహ్మణి..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి నట సింహం బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా రాణించిన ఆమె.. ఇప్పుడు ఓ బైక్ రైడర్‌గా మారారు. కొండల్లో బైక్ పై రయ్..రయ్ అంటూ దూసుకుపోయారు.  లేహ్ నుంచి లడక్ వరకూ బైక్ రైడింగ్ చేసి నారా బ్రాహ్మణి అందరినీ ఆకట్టుకున్నారు. 

తాను లడఖ్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లినట్లుగా చెప్పారు. ఉదయంపూట ఇక్కడ్నుంచి బైక్ రైడింగ్ చేస్తూ బయల్దేరామన్నారు. థిక్సే మాంటెన్సరికీ చేరిన తర్వాత అక్కడే టిఫిన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక బ్రాహ్మణి స్పిరిట్యువల్ ఎక్స్ పీరియెన్స్ జర్నీ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్-లడక్ లాంటి హిల్ స్టేషన్ ప్రాంతంలో బ్రాహ్మణి ట్రావెల్ చేశారు. ఎంతో బరువున్న బైక్‌ను అంతదూరం ఆమె సునాయాసంగా నడుపుకుంటూ వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నారా బ్రాహ్మణి ఒక మంచి బైక్ రైడర్ అంటూ ఆమెలో మంచి టాలెంట్ ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ఆ బైక్ చాలా బరువుగా ఉన్నా సరే.. అంతదూరం ఆమె రైడ్ చేయడం గ్రేట్ అంటున్నారు. ఆమె నడిపిన బైక్ రంగు కూడా పసుపు కావడం విశేషం.

హిమాలయాలను సైతం అధిరోహించగలిగే సామర్థ్యం ఉన్న బైక్‌లను తయారు చేసే జావా యుజ్ది కంపెనీ ప్యాషనేట్ రేసర్లను ఓ జట్టుగా ఏర్పాటు చేసి.. తమ బైక్‌ల మీద ఇలా ట్రిప్‌లకు ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఓ ట్రిప్‌లో నారా బ్రహ్మణి పాల్గొన్నారు. బైక్‌కు ఏమైనా సమస్య వచ్చినా.. ప్రమాదం జరిగినా సాయం చేయడానికి కంపెనీ టీం ఉంటుంది కానీ.. మొత్తంగా శారీరక శ్రమతోనే బైక్ రేసింగ్ చేయాలి. ఇలాంటి రేసింగ్‌ను నారా బ్రాహ్మణి పూర్తి చేశారు. కశ్మీర్‌లోని లద్దాఖ్ నుంచి లెహ్ వరకూ ఈ సాహస యాత్ర సాగింది. నారా బ్రహ్మణి బైక్‌ను అలవోకగా నడిపిన విధానం.. అందరిని ఆకట్టుకుంది. ప్రయాణ అనుభవాలను కూడా బ్రాహ్మణి అందరితో పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది.

చిన్ననాటి నుంచి ఇటు సినీ, అటు రాజకీయ రంగాలను దగ్గరగా చూసిన నారా బ్రాహ్మణి.. తనకు ఇష్టమైన వ్యాపార రంగంలోకి వెళ్లారు. అంతేగాక, హేరిటేజ్ ఫుడ్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలను కూడా ఆమె చేపట్టారు. హేరిటేజ్ సంస్థలో పనిచేస్తున్న పేద కార్మికుల పిల్లలకు చదువు కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.