- రూ.23.50 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- ఫలించిన చొప్పదండి ఎమ్మెల్యే కృషి
కరీంనగర్, వెలుగు: నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని భూ నిర్వాసితులకు ఎట్టకేలకు పరిహారం విడుదలైంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో 20 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్–-2 లో భాగంగా గంగాధర మండలంలో చేపట్టిన నారాయణపూర్ రిజర్వాయర్, కెనాల్ ముంపు భూములకు రూ.23.50 కోట్ల పరిహారాన్ని సర్కారు శనివారం విడుదల చేసింది. దీంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1999లో మంచినీటి ప్రాజెక్టుగా..
శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్–-2 ద్వారా నారాయణపూర్, స్తంభంపల్లి చెరువుల విస్తరణ, నారాయణపూర్ నుంచి వేములవాడ, స్తంభంపల్లి చెరువులకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం కోసం 20 ఏండ్ల క్రితం భూములు సేకరించారు. గంగాధర మండలంలోని 46 గ్రామాలు, ప్రస్తుత కొత్తపల్లి మండలంలోని 3 గ్రామాల ప్రజలకు తాగునీరందించేందుకు 1999లో అప్పటి ఎమ్మెల్యే న్యాలకొండ రాంకిషన్ రావు ఆధ్వర్యంలో గంగాధర చెరువును మంచినీటి ప్రాజెక్టుగా మార్చారు.
కాంగ్రెస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ చొరవతో వైఎస్సార్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చి 1.50 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా నారాయణపూర్ రిజర్వాయర్ గా మార్చింది. ఇందులో భాగంగా ఎల్లమ్మ చెరువు, నారాయణపూర్ చెరువు, చర్లపల్లి (ఎన్) పరిధిలోని గబ్బిలాల చెరువులను కలిపేశారు. దీంతో నారాయణపూర్, చర్లపల్లి (ఎన్), మంగపేట గ్రామాల్లో కలిపి 240 ఎకరాల వ్యవసాయ భూములు, నారాయణపూర్ లో 25 ఇండ్లు, మంగపేటలో 11 ఇండ్లు, చర్లపల్లిలో కొన్ని ఇండ్లు ముంపునకు గురవుతున్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు. అలాగే, మంగపేటలో 87.16 ఎకరాల సాగు భూమి, 40 వ్యవసాయ బావులు, 11 ఇండ్లకు ఐదేండ్ల క్రితం అవార్డు ఎంక్వైరీ జరిగింది. దీనికి సంబంధించి భూ నిర్వాసితులు సంతకాలు చేసినా పరిహారం అందలేదు.
పరిహారంపై హామీ..
బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గ అప్పటి కాంగ్రెస్ ఇన్చార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో పలుమార్లు రైతులు ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూనిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తానని ఆయన ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అన్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నారాయణపూర్ నిర్వాసితుల కష్టాలను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది జనవరి 22న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నారాయణపూర్ కు తీసుకువచ్చారు. రూ.70 కోట్లు విడుదల చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం మొదటి దఫాలో రూ.23.50 కోట్లు రిలీజ్చేసింది.
సీఎం, మంత్రికి ధన్యవాదాలు
నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు రూ.23.50 కోట్లు రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ప్రజాపాలనలో వారికి న్యాయం జరిగింది. మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే
