రాహుల్, కేజ్రీవాల్​కు ఫవాద్ మద్దతివ్వడం తీవ్రమైన అంశం : మోదీ

రాహుల్, కేజ్రీవాల్​కు ఫవాద్ మద్దతివ్వడం తీవ్రమైన అంశం : మోదీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు పాకిస్తాన్ మినిస్టర్ నుంచి మద్దతు లభించడం తీవ్రమైన అంశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయినా.. మన దేశ ఓటర్లకు ఎవరేంటో తెలుసని, పొరుగు దేశాల కామెంట్లతో ప్రభావితం కారని చెప్పారు. తానున్న పొజిషన్​లో అలాంటి అంశాలపై ఎక్కువ వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు. కానీ.. ప్రతి ఒక్కరి ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని ఐఏఎన్​ఎస్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. రాహుల్ గాంధీని పొగుడుతూ పాక్​ మినిస్టర్ ఫవాద్ చౌదరి హుస్సేన్ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. దీనిపై రాహుల్ ఎలాంటి కామెంట్లు చేయలేదు. ‘విద్వేష, తీవ్రవాద శక్తులపై శాంతి, సామరస్యాలదే గెలుపు కావాలి’ అంటూ అర్వింద్ కేజ్రీవాల్​ను ఉద్దేశిస్తూ ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ‘ముందు మీ సొంతిల్లు చక్కబెట్టుకోండి’ అంటూ పాక్ మంత్రికి చురకలు అంటించారు.

అన్నింట్లో బలంగా ఉన్నం

రాహుల్, కేజ్రీవాల్​కు ఫవాద్ చౌదరి మద్దతివ్వడంపై ప్రధాని మోదీ ఐఏఎన్ఎస్ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘మనతో శత్రుత్వం ఉన్నవారు కొంతమందిని మాత్రమే ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు తెలియదు. అక్కడ నుంచి కొద్దిమంది మాత్రమే ఇక్కడి వాళ్లకు మద్దతు ఇస్తూ తెగ పొగిడేస్తున్నరు. ఇది ఆందోళన కలిగించే విషయమని నేనూ అంగీకరిస్తున్న. వాళ్లు(పాకిస్తాన్) మనల్ని శత్రువులుగా చూస్తారు. కానీ.. కొందరిని మాత్రం మిత్రులుగా చూస్తున్నారు. ఎవరు.. ఎలాంటి వారనేది ఇండియన్ ఓటర్లు గమనిస్తున్నరు. ఓటర్లందరికీ ఆలోచించే శక్తి ఉన్నది. బార్డర్ అవతల నుంచి వచ్చే ప్రకటనలు కూడా భారత ఎన్నికలను ప్రభావితం చేయవు’’ అని మోదీ అన్నారు. 

కేజ్రీవాల్, రాహుల్​పై ట్వీట్లు

కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్​పై రిలీజ్ కావడంపై కూడా పాక్​ మినిస్టర్ ఫవాద్ చౌదరి గతంలో స్పందించారు. ‘మోదీ జీ మరో యుద్ధంలో ఓడిపోయారు. కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలయ్యారు’’అంటూ పోస్టు చేశారు. ‘‘రాహుల్ మాంచి ఫైర్ మీద ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియాలో ఏం జరుగుతున్నదనేది ఆయన చాలా చక్కగా వివరించాడు’’అంటూ గతంలో ఫవాద్ మరో పోస్టు చేశారు.