
మోడీకే మరోసారి దేశ ప్రజలు పట్టంగట్టారు. ఎన్డీయేకు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆధిక్యాన్ని కనబర్చాయి. యాభై.. వంద.. నూటయాభై…రెండువందలు.. ఇలా నిమిషం నిమిషానికి లీడ్స్ పెరుగుతూ పోయాయి. కేంద్రంలో అధికారానికి కావాల్సిన 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కౌంటింగ్ ప్రారంభమైన మూడుగంటల్లోనే ఎన్డీయే దాటేసింది. 352 సీట్లకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలలోపే ట్రెండ్స్ తెలిసినా.. క్యాండిడేట్లలో మాత్రం ఉత్కంఠ కనిపించింది. మధ్యాహ్నం 2 తర్వాత ఒకటొకటిగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 95 సీట్లు సాధించగా.. అటు ఎన్డీయేకు కానీ, ఇటు యూపీఏకు కానీ మద్దతు తెలుపని తటస్థ పార్టీలు 95 దగ్గర ఆగిపోయాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో తమిళనాడులోని వెల్లూరు సీటుకు ఎన్నికలు వాయిదా పడగా.. 542 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికలు ఈ నెల 19తో ముగిశాయి.
అదేరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎవరిది అధికారమో ఒక అంచనా ఏర్పడింది. ఎన్డీయేనే మళ్లీ పవర్లోకి వస్తుందని తేలింది. కానీ, ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాదించాయి. ఆ వాదన నిలబడలేదు. ఒకటీ రెండు సర్వే సంస్థల అంచనాలు తప్ప అన్ని ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. హిందీ రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్రలో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో బలమైన శక్తిగా అవతరించింది. సౌత్ రాష్ట్రాల్లోని కర్నాటకలో అత్యధిక సీట్లు సాధించింది. తెలంగాణలోనూ 4 సీట్లు గెలిచి.. సత్తా చాటింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మినహా దేశమంతటా బీజేపీ, దాని మిత్రపక్షాల హవా నడిచింది. అన్ని రాష్ట్రాల్లో సగటున బీజేపీ 50శాతం ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ల లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతం విషయంలో అత్యధిక ఓట్లు దక్కించుకున్న తొలి పార్టీగా కూడా ఈసారి బీజేపీ రికార్డుకెక్కింది. ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. 4లక్షల 79వేలకుపైగా మెజారిటీ సాధించారు.
బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి 5లక్షలకుపైగా మెజారిటీ రాబట్టుకున్నారు. ఇక, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీకి పరాభవం ఎదురైంది. కేంద్రంలో అధికారం మాట అటుంచితే తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఆయన బీజేపీ క్యాండిడేట్ స్మృతి ఇరానీ చేతుల్లో ఓడిపోయారు. అయితే.. కేరళలోని వయనాడ్‌లో మాత్రం రాహుల్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ వంటి ఉద్ధండులకు కూడా ఓటమి తప్పలేదు.
బీజేపీ ‘హార్ట్’ల్యాండ్
హిందీ హార్ట్‌ల్యాండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఢిల్లీ.. బీజేపీకి భారీ స్థాయిలో సీట్లు కట్టబెట్టాయి. ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ మంచి ఫలితాలే రాబట్టకున్నప్పటికీ 2014తో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గాయి. యూపీలో ఈ సారి ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిగా బరిలోకి దిగడం బీజేపీ సీట్లపై ప్రభావం చూపింది. అయినా.. అక్కడున్న 80 సీట్లలో అప్నాదళ్‌తో కలిసి బీజేపీ 62 సీట్లను గెలుచుకుంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి కేవలం 15 సీట్లే వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 71 సీట్లు గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ మాత్రం కనిపించలేదు. రాష్ట్రంలో వేరు.. కేంద్రంలో వేరు అన్న ఆలోచనలతో ఓటర్లు గంపగుత్తగా కమలానికి ఓటేశారు. బీహార్‌లోని మొత్తం 40 సీట్లలో 39, మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 సీట్లలో 28, రాజస్థాన్‌లోని మొత్తం 25 సీట్లలో 25, హర్యానాలోని మొత్తం 10 సీట్లలో 9, జార్ఖండ్‌లోని మొత్తం 12 సీట్లలో 10, చత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 సీట్లలో 9, ఢిల్లీలో మొత్తం 7 సీట్లలో 7 సీట్లలో కమలనాథులు దూసుకుపోయారు.
దీదీ కోటలో దిల్దార్గా..
ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క పశ్చిమ బెంగాలే. అక్కడ మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు గెలుచుకుంది. ఈసారి అనూహ్యంగా పుంజుకొని.. 18 సీట్లకు ఎగబాకింది. గత ఎన్నికల్లో 34 సీట్లు సాధించిన రాష్ట్రంలోని అధికార టీఎంసీ.. ఈ సారి 22కు పరిమితమైంది. ఒకప్పుడు లెఫ్ట్ ఫార్టీల కంచు కోటగా ఉన్న బెంగాల్.. అటు తర్వాత టీఎంసీ వశమైంది. ప్రతి ఎలక్షన్లో టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు పోటాపోటీగా ఉండేవి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ, బీజేపీ మధ్యే పోరు సాగింది. ప్రధాని నరేంద్రమోడీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మధ్య ఈ ఎన్నికల్లో మాటల యుద్ధం సాగింది. ఒకానొక దశలో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా కూడా దీదీ మారిపోయారు. కానీ.. మోడీ సునామీకి టీఎంసీ కోటలు కూలిపోయాయి. రెండేళ్లుగా రాష్ట్రంపై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టి.. అత్యధిక స్థానాలను రాబట్టుకోగలిగారు. ఇక, ఒడిశాలో 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. అధికార బీజేడీ 20 సీట్లు సాధించింది. అయితే.. ఈ సారి అక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంది. రాష్ట్రంలో మళ్లీ బీజేడీ అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన సీట్లు సాధించుకుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ, బీజేడీ నువ్వా నేనా అన్నట్లు గా తలపడ్డాయి. బీజేపీ 8, బీజేడీ 12 సీట్లు సాధించాయి. గుజరాత్లో 26 సీట్లకు 26 సీట్లు బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనతో కలిసి 41 సీట్లు సాధించుకుంది. జమ్ముకశ్మీర్‌లోనూ పట్టు నిలుపుకుంది.
సౌత్‌లో కలిసొచ్చిన కర్నాటక, తెలంగాణ
సౌత్‌లో బీజేపీకి పట్టున్న రాష్ట్రం కర్నాటక. ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అధికారంలోకి వచ్చాయి. లోక్‌సభ ఫలితాలు వెలువడిన నాటికి కరెక్ట్‌గా అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది. ఏడాదిలోనే సీన్ మొత్తం మారిపోయింది. మొత్తం 28 లోక్‌సభ సీట్లలో ఈ సారి 25 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి 2 సీట్లకే పరిమితమైంది. జేడీఎస్ వ్యవస్థాకుడు, మాజీ పీఎం దేవెగౌడ, ఆయన మనుమడు నిఖిల్ కూడా ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ 19 సీట్లు గెలుచుకుంది. కర్నాటకతో పాటు ఈసారి ఎవరూ ఊహించనట్లుగా తెలంగాణలో 4 చోట్ల విజయం సాధించింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సికింద్రాబాద్‌కే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సీట్లను గెలుచుకుంది. ఏపీ, కేరళలో ఒక్క సీటునూదక్కించుకోలేదు. తమిళనాడులో తన మిత్ర పక్షం అన్నాడీఎంకేతో కలిసి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే.. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సారి తమిళనాడులోని ప్రధాన ప్రత్యర్థులు అన్నాడీఎంకే, డీఎంకే.. జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకున్నాయి. అన్నాడీఎంకే బీజేపీతో డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగాయి. తమిళనాడులో బీజేపీ అంత సత్తా చాటకపోయినప్పటికీ అక్కడ కూడా తాము ఉనికిలో ఉన్నామని నిరూపించుకోగలిగామని, ఇదే మున్ముందు మంచి ఫలితాలను ఇస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
పదేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏను 2014లో గద్దె దించి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ.. ఐదేళ్లు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో కొన్ని ప్రజలకు ఇబ్బందులు కలిగించినప్పటికీ.. వాటి ఫలితాలు మున్ముందు వస్తాయని బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే, ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి మంత్రంతోనే ఎన్నికలకు వెళ్లారు. నేషనలిజాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. పాక్‌లోని టెర్రర్ స్థావరాలపై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌ను గుర్తుచేశారు. ‘అబ్ కీ బార్ 300 ప్లస్’ నినాదంతో బీజేపీ చీఫ్ అమిత్ షా.. కార్యకర్తలను ముందుండి నడిపించారు. అయితే.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మాత్రం ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ జనంలోకి వచ్చారు. న్యాయ్ వంటి పథకాలు మేనిఫెస్టోలో చేర్చినా..‘చౌకీదార్ చోర్ హై’ అన్న నినాదాన్నే ఆయన బలంగా వినిపించాలనుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా రాహుల్‌తో పాటు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, జేడీఎస్ చీఫ్ కుమార స్వామి ఇలా అన్ని ప్రతిపక్షాలు ఒకటిగా నడిచాయి. కానీ.. ఓటర్లు మాత్రం మోడీ వైపు నడిచారు. మోడీ నేషనలిజానికి, ఆయన ఐదేళ్ల పాలనకు ఓటేశారు. ఐదేళ్లలో నిరుద్యోగులను పట్టించుకోలేదని, రైతు సమస్యలను ఆలకించలేదని, క్రైం రేట్ పెరిగిందని, రాఫెల్ పేరిట లక్షల కోట్లు అంబానీకి కట్టబెట్టారని ఇలా ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ఓటర్లు ఆలకించలేదు. చౌకీదార్ మోడీతోనే దేశానికి రక్షణ అంటూ ఏకపక్షంగా తీర్పు నిచ్చారు.