
న్యూఢిల్లీ: వెటరన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బాత్రా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. దీనితో పాటు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్ష పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు సోమవారం మూడు రాజీనామా లేఖలు సమర్పించారు. హాకీ ఇండియాలో బాత్రా శాశ్వత సభ్యత్వం చెల్లదని మే 25న తీర్పునిచ్చిన ఢిల్లీ హైకోర్టు ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి కూడా ఆయన తప్పుకోవాలని ఆదేశించింది. 2016, 2021లలో వరుసగా రెండుసార్లు ఎఫ్‌ఐహెచ్‌కి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన బాత్రాకు 2019లో ఐఓసీ సభ్యత్వం లభించింది. కాగా, హాకీ ఇండియాలో నిధుల దుర్వినియోగం కేసులో బాత్రా ఆఫీసుల్లో సీబీఐ సోమవారం సోదాలు చేసింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి పలు రికార్డులు, పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.