పోలీస్ అధికారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన రైతు

పోలీస్ అధికారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన రైతు

కొంత మంది వ్యక్తులు తమకు నచ్చిన అభిమాన నాయకుల ఫోటోలకు, విగ్రహాలకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు.. కానీ అందుకు భిన్నంగా ఓ పోలీస్ అధికారి ఫ్లెక్సీకి కుటుంబంతో సహా పాలాభిషేకం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఓ రైతు. వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేటకు చెందిన నాడెం వీర‌స్వామి అనే రైతు త‌న‌కున్న రెండెక‌రాల వ్యవసాయ భూమిలో ఇర‌వై గుంట‌ల భూమిని 2018 మే నెల‌లో న‌ర్సంపేట శివారులో గ‌ల ఏనుగుల తండాకు చెందిన ఎస్ బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయ‌క్ భార్యకు, అత‌డి సోద‌రుడు బానోత్ సునిల్ నాయ‌క్‌కు విక్రయించాడు. హ‌ద్దులు కూడా చూపించాడు. మిగితా భూమిలో వీర‌స్వామి వ్యవ‌సాయం చేసుకుంటున్నాడు. 

కాగా, గ‌త కొద్ది రోజుల నుంచి బానోత్ అనిల్ నాయ‌క్‌, సునిల్ నాయ‌క్ వీర‌స్వామిని మ‌రో ప‌ది గుంట‌ల వ్యవసాయ భూమి త‌మ‌కు అమ్మాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. అయితే, వీర‌స్వామి త‌న‌ భూమి అమ్మడం ఇష్టం లేద‌ని చెప్పాడు. అప్పటి నుంచి అనిల్ నాయ‌క్‌, సునిల్ నాయ‌క్ మ‌రికొంత మందితో క‌లిసి ప‌లుమార్లు వీర‌స్వామిని బెదిరించ‌డంతోపాటు దాడికి కూడా య‌త్నించారు. వీర‌స్వామి పొలాన్ని ధ్వంసం చేశారు. హ‌ద్దు రాళ్లు తొల‌గించారు. వీర‌స్వామి ఎంత ప్రాధేయ‌ప‌డ్డా వినిపించుకోక‌పోగా, అత‌డిపైనే కులం పేరుతో త‌మ‌ను దూషించాడ‌ని 2023 ఫిబ్రవ‌రి 27న న‌ర్సంపేట పోలీసుల‌కు అనిల్ నాయ‌క్‌, సునిల్ నాయ‌క్ ఫిర్యాదు చేశారు. వీర‌స్వామిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. అయితే, త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోలీస్ క‌మిష‌న‌ర్ రంగనాథ్‌కు రైతు వీర‌స్వామి ఫిర్యాదు చేశారు. 

దీంతో డీసీపీ కరుణాకర్ తో స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపిన అనంతరం రైతు వీర‌స్వామిపై త‌ప్పుడు కేసు న‌మోదు కావ‌డంపై సీపీ రంగనాథ్ సీరియ‌స్ అయ్యారు. రైతు వీరస్వామిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫాల్స్ కేసుగా ప‌రిగణించి, తీసివేయాల‌ని, అలాగే, బానోత్ అనిల్ నాయ‌క్‌, సునిల్ నాయ‌క్‌, వీరి తండ్రి సీతారాంనాయ‌క్‌, చింతల నిరంజ‌న్ తోపాటు వీరికి స‌హ‌క‌రించిన మ‌రో ఏడుగురిపై కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. దీంతో 11 మంది నిందితుల‌పై 386, 290,447,427,420,506,143,149 సెక్షన్లపై న‌ర్సంపేట‌ పోలీసులు ఈనెల 11న కేసులు న‌మోదు చేశారు. పోలీస్ క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల‌తో త‌న‌కు న్యాయం జ‌రిగిందని అందుకే తాము సీపీ రంగనాథ్ కి పాలాభిషేకం చేశామని బాధిత రైతు నాడెం వీర‌స్వామి సంతోషం వ్యక్తం చేశాడు.