ఔటర్ రింగ్ రోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా 200 కిలోమీటర్లకు పైగా స్పీడుతో కారు నడిపి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు నసింగి పోలీసులు. నార్సింగి టోల్ గేట్ నుండి టీజీపీఏ టోల్ గేట్ వైపు మే 10న ఉదయం సుమారు 10:30 గంటలకు వాహన తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ “TGTR2026” కలిగిన వోక్స్‌వ్యాగన్ కారును ఓ వ్యక్తి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడిపినట్ల సాయిరామ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించి “యశ్వంత్ రెడ్డి” పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు.
సాయిరామ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు యస్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితుడిని యశ్వంత్ రెడ్డి (32), ప్రైవేట్ ఉద్యోగి, మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్,నివాసిగా గుర్తించారు.
►ALSO READ | మానకొండూరులో ఒకే రోజు రెండు అగ్నిప్రమాదాలు... అగ్నికి ఆహుతైన పశువులు..
ఏప్రిల్-2026లో వోక్స్‌వ్యాగన్ కారును కొనుగోలు చేసిన యస్వంత్, వాహనం పనితీరును పరీక్షించేందుకు ORR పై సుమారు 200 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. యస్వంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు వాడిన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర స్టంట్లు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ తరహా చర్యలు అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించి ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
