నాసా మూన్​ మిషన్​ ఆర్టిమిస్ కు 2 లక్షల కోట్లు కావాలి

నాసా మూన్​ మిషన్​ ఆర్టిమిస్ కు 2 లక్షల కోట్లు కావాలి

వాషింగ్టన్‌‌‌‌:ఇండియా చంద్రయాన్​ 2 ప్రయోగాన్ని మరికొద్ది రోజుల్లో చేపట్టబోతోంది. దానికి అయ్యే ఖర్చు ₹978 కోట్లు అని ఇస్రో ప్రకటించింది. మనం చంద్రయాన్​ 2 ప్రయోగాన్ని ప్రకటించడం కన్నా ముందే అమెరికా నాసా మూన్​ మిషన్​ ‘ఆర్టిమిస్​ (గ్రీసులో చంద్రదేవత పేరు)’ను ప్రకటించింది. 2024లో ప్రయోగాన్ని చేయడానికి సిద్ధమవుతోంది. మరి, ఆ ప్రయోగానికి అమెరికా పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? సుమారు ₹2.1 లక్షల కోట్లు. డాలర్లలో చెప్పాలంటే 3 వేల కోట్ల డాలర్లు. అవును, ఈ విషయాన్ని స్వయంగా నాసా చీఫ్​ జిమ్​ బ్రైడెన్​స్టైన్​ ప్రకటించారు. మూన్​ మిషన్​ చేపట్టాలంటే ఎంత లేదన్నా ₹1.39 లక్షల కోట్ల (2 వేల కోట్ల డాలర్లు) నుంచి ₹2.1 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆ ప్రయోగానికి అంత మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని గురువారం అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్​ఎన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అంటే ఏటా సుమారు ₹27,952 కోట్ల (400 కోట్ల డాలర్లు) నుంచి సుమారు ₹41,928 కోట్లు (600 కోట్ల డాలర్లు) ఖర్చు అవుతుందని చెప్పారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్లు వెళ్లేలా చంద్రుడిపై అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అక్కడ బతకడం, పనిచేసుకునేలా వసతులు కల్పించడం కోసం ఆర్టిమిస్​ను చేపట్టినట్టు బ్రైడెన్​స్టైన్​ చెప్పారు. ఆ స్ఫూర్తితోనే అంగారకుడిపైకీ చరిత్రలోనే తొలిసారిగా మనిషిని పంపే కార్యక్రమం చేపడతామన్నారు. నిజానికి చాలా మంది అంతకన్నా ఎక్కువే ఖర్చవుతుందంటూ చెప్పారని, తాము చెప్పింది దానికి తక్కువేనని అన్నారు. ఈ స్పేస్​ఫ్లైట్​ చాలా రిస్క్​తో కూడుకున్నదని, ఏమవుతుందో ఊహించలేమని, అందుకే ఇప్పుడు చెప్పిన ఖర్చు కేవలం అంచనా మాత్రమేనని అన్నారు. అది పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చని వివరించారు. ఖర్చుపై ఫెడరల్​ ఆఫీస్​ మేనేజ్​మెంట్​ అండ్​ బడ్జెట్​ విభాగంతో చర్చిస్తున్నామన్నారు. అంతేగాకుండా ఇటీవల కొత్తగా వైస్​ ప్రెసిడెంట్​ మైక్​ పెన్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్​ స్పేస్​ కౌన్సిల్​తోనూ చర్చిస్తున్నామన్నారు.

రాకెట్​కే ₹83,800 కోట్లు

నాసా ఇప్పటికే కేవలం రాకెట్​, స్పేస్​క్రాఫ్ట్​పైనే భారీగా ఖర్చు చేసింది. ప్రపంచంలోని ఏ రాకెట్​ కూడా పనికిరాదన్నట్టుగా కొత్త రాకెట్​ను తయారు చేసింది. అదే స్పేస్​ లాంచ్​ సిస్టం (ఎస్​ఎల్​ఎస్​). ఆ రాకెట్​తో చంద్రుడేంది.. అంగారకుడిపైకీ మనుషుల్ని తీసుకోవచ్చని చెప్పింది. ఆ ఒక్క భారీ రాకెట్​ కోసం సుమారు ₹67,738 కోట్లు (970 కోట్ల డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు. 2017లో ప్రారంభించిన రాకెట్​ నిర్మాణానికి ఇప్పటికే ₹83,800 కోట్లు (1200 కోట్ల డాలర్లు) ధారపోశారు. వచ్చే ఏడాదికిగానీ ఆ రాకెట్​ నిర్మాణం పూర్తి కాదని, అప్పటి వరకు దాని ఖర్చు మరింత పెరిగిపోతుందని నిపుణులు విమర్శిస్తున్నారు. స్పేస్​క్రాఫ్ట్​ ఓరియన్​పైనా డబ్బులు దండిగానే ఖర్చు పెడుతున్నట్టు చెబుతున్నారు. బ్రైడెన్​స్టైన్​ మాత్రం ఖర్చును వెనకేసుకొస్తున్నారు. 1960 తర్వాత మళ్లీ ఇప్పుడు చంద్రుడిపైకి మనిషిని పంపిస్తున్నామని, అయితే, అప్పటి ప్రయోగానికి, ఇప్పటి ప్రయోగానికి చాలా తేడాలున్నాయని ఆయన అన్నారు. కాబట్టి ఖర్చు ఎక్కువగానే ఉంటుందన్నారు. అందుకే ఆ ఖర్చును భరించేలా ప్రైవేట్​ కంపెనీలకు ప్రయోగంలో భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు.

వెళ్లే మహిళెవరు.. లిస్టులో సునీతా విలియమ్స్?

చంద్రుడిపై కాలుమోపిన తొలి వ్యక్తి ఎవరు.. అంటే ఠక్కున వచ్చే సమాధానం నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్​. మరి, తొలి మహిళెవరు అంటే..? ‘ఆర్టిమిస్​’లో మహిళను చంద్రుడిపై దింపుతామని నాసా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మహిళ ఎవరు అన్నదానిపైనే అందరి దృష్టి ఉంది. అయితే, నాసాలో రోస్టర్​ ప్రకారం ప్రస్తుతం 12 మంది మహిళా ఆస్ట్రోనాట్లున్నారు. వాళ్లలోనే ఎవరినో ఒకరిని పంపాలని నాసా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్​ కూడా ఉండడం విశేషం. వాళ్లంతా కూడా 40 ఏళ్ల నుంచి 53 ఏళ్ల వయసు వారే. మాజీ మిలటరీ పైలట్లు, డాక్టర్లు, సైంటిస్టులున్నారు. ఇప్పటికే స్పేస్​లో గడిపిన వారిని చంద్రుడిపైకి పంపితేనే బాగుంటుందని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం ఐఎస్​ఎస్​లో ఉన్న ఆనీ మెక్​క్లెయిన్​ బెస్ట్​ చాయిస్​ అని చెబుతున్నారు. ఐఎస్​ఎస్​లోనే ఉన్న క్రిస్టినా కోచ్​ కూడా మంచి చాయిస్​ అంటున్నారు. దాదాపు 11 నెలలు ఆమె స్పేస్​లో ఉందన్న విషయం గుర్తు చేస్తున్నారు. ఆమె తర్వాత మెరీన్​ బయాలజిస్ట్​ జెస్సికా మైర్​, నికోల్​ మన్​ పేర్లు వినిపిస్తున్నాయి. స్పేస్​లో మంచి అనుభవమున్న సునీతా విలియమ్స్​ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, 2024 నాటికి ఆమెకు 58 ఏళ్లు వస్తాయి. దీంతో ఆమె వయసును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో 77 ఏళ్ల జాన్​ గ్లెన్​ స్పేస్​లోకి వెళ్లారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సునీతా విలియమ్స్​.. చంద్రుడిపై అడుగు పెట్టే తొలి మహిళగా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అన్ని పైసలిస్తరా?

ప్రయోగంపై డెమొక్రాట్లు ఇప్పటికే కొంత మూతిముడుపు ధోరణితో ఉన్నారు. వాళ్లను ఒప్పించి అంత బడ్జెట్​ రాబట్టడమంటే బ్రైడెన్​స్టైన్​కు సవాల్​తో కూడుకున్న పనేనని నిపుణులు అంటున్నారు. మరోవైపు ట్రంప్​ మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చందమామ ప్రయోగాన్ని చేసేయాలని తొందరపెడుతున్నారు. బడ్జెట్​ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ప్రాజెక్ట్​ కోసం అదనంగా సుమారు ₹11,173 కోట్లు (160 కోట్ల డాలర్లు) కావాలని, ఆమేరకు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్​కు నాసా రిక్వెస్ట్​ కూడా పెట్టింది. అయితే, అది ఓ చిన్న డౌన్​పేమెంట్​ మాత్రమేనని బ్రైడెన్​స్టైన్​ చెబుతున్నారు. అయితే, విమర్శకులు మాత్రం మూన్​ మిషన్​పై పెదవి విరుస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కొన్ని లక్షల కోట్లను అనవసరంగా అంతరిక్షంలో కుమ్మరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. 1972 అపోలో మిషన్​ తర్వాత చంద్రుడిపైకి మనిషి పోయింది లేదు.. అక్కడ ప్రయోగాలు చేసింది లేదు గానీ.. వాటి పేరిట డబ్బులు మాత్రం ఉచితార్థంగా ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. అయితే, ఆర్టిమిస్​ కోసం తామేం ‘మనుషుల్ని పీక్కు తినదలచుకోలేదు’ అని బ్రైడెన్​స్టైన్​ తేల్చి చెప్పారు.