
అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా.. సూర్యుడికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. పది సంవత్సరాల క్రితం సూర్యుడు.. ప్రస్తుతం సూర్యుడు ఎలా ఉన్నాడో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ గంట నిడివి గల వీడియోను ‘ఏ డెకేడ్ ఆఫ్ సన్’ అనే పేరుతో బుధవారం విడుదల చేసింది. ఆ వీడియో ప్రకారం.. సూర్యుడు జూన్ 2, 2010 నుంచి జూన్ 1, 2020 వరకు ఎలా మార్పు చెందాడో కనిపిస్తుంది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ పది సంవత్సరాలుగా సూర్యుడి ప్రతి కదలికను రికార్డ్ చేసింది. అలా పది సంవత్సరాలలో 425 మిలియన్ల హై రెజల్యూషన్ ఫోటోలను సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సేకరించింది. ఆ మొత్తం ఫొటోలను కలిపి.. ప్రతి గంటకు ఒక ఫొటోను జత చేస్తూ.. మొత్తం పది సంవత్సరాల కాలాన్ని ఒక గంట ఒక నిమిషం(61 నిమిషాలలో)లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 7.4లక్షల వ్యూస్‌ను సంపాదించుకుంది.