
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలకు అద్దం పట్టిన ‘బలగం’ సినిమా మరోసారి తన సత్తా చాటింది. ఈ సినిమాలోని హృదయాన్ని కదిలించే ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు.
వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై, విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించింది. తెలంగాణ పల్లెల్లో ఉండే కట్టుబాట్లు, మనుషుల మధ్య అనుబంధాలు, ముఖ్యంగా చావు తర్వాత కుటుంబ సభ్యులు పడే ఆవేదనను ఈ సినిమా చాలా సహజంగా చూపించింది. ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు.
ఈ సినిమాలోని పాటలు కూడా సినిమా విజయానికి ముఖ్య కారణమయ్యాయి. అందులోనూ 'ఊరు పల్లెటూరు' పాట సినిమా ఆత్మగా నిలిచింది. పల్లెటూరి జ్ఞాపకాలను, మనుషుల అనుబంధాలను కళ్లకు కట్టినట్టుగా వర్ణించిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందరినీ కదిలించింది. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, గాయకుడు రామ్ మిరియాల ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ పాటలో తెలంగాణ యాస, సంస్కృతి మేళవించి రాసిన కవిత్వం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.
కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ‘బలగం’కు లభించిన ఈ గుర్తింపు తెలంగాణ సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు కాసర్ల శ్యామ్ తెలిపారు.. గ్రామీణ కథలకు, సహజత్వానికి ఇంకా విలువ ఉందని ఈ సినిమా నిరూపించిందన్నారు.. ఈ అవార్డుతో తెలంగాణ సినీ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించింది. ఈ విజయం బలగం సినిమా సాధించిన రికార్డు .. ఈ అవార్డు తమపై మరింత నమ్మకాన్ని పెంచిందన్నారు.
బలగం' సినిమా తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాలకు అద్దం పట్టిన ఒక అద్భుత కళాఖండం. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రం, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యం, మనుషుల మధ్య అనుబంధాలు, ముఖ్యంగా చావు తర్వాత కుటుంబంలో జరిగే సంప్రదాయాలు కథాంశంగా చూపించారు. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించి రికార్డు సృష్టించింది.