జాతీయ బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలి : రవీంద్ర నాయక్ ​డిమాండ్

జాతీయ బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలి : రవీంద్ర నాయక్ ​డిమాండ్
  • సంత్ సేవాలాల్ మహరాజ్ జ్ఞాపకార్థం నిర్మించాలి

ఖైరతాబాద్, వెలుగు :  హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్​తో సంత్​ సేవాలాల్​మహరాజ్​కు ఎంతో అనుబంధం ఉందని మాజీ ఎంపీ, దక్షిణ భారత్, మహారాష్ట్ర, మధ్య భారత్​ సేవాలాల్ ​సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రవీంద్రనాయక్​ అన్నారు. ఆయన స్మారకార్థం పది ఎకరాలు భూమి కేటాయించి, మందిరం నిర్మించి 100 అడుగుల విగ్రహం ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవాలాల్​ మహరాజ్​ బంజారాహిల్స్, బంజారా దర్వాజా (గోల్కొండ )పరిసరాల్లో అనేక నెలల పాటు క్యాంపులు నిర్వహించారని గుర్తుచేశారు.

ఆయన జ్ఞాపకార్థం జాతీయ బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ ​చేశారు. దేశంలోని వివిధ  రాష్ట్రాల్లోని బంజారా సామాజికవర్గం రాజకీయంగా100 ఎంపీ, 400 ఎమ్మెల్యే సెగ్మెంట్లపై తమ ప్రభావం చూపగలదని ఆయన పేర్కొన్నారు.   కర్ణాటకలో అమలు చేస్తున్నట్లు బంజారా తండా ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలని, బంజారా భాష గోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​లో చేర్చి  భాషాభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే  బంజారా నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సంస్థ జాతీయ కన్వీనర్​ జి. రవినాయక్, కృష్ణ నాయక్​ పాల్గొన్నారు.​