బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తం..9వ షెడ్యూల్‌‌లో చేర్చకపోతే బీసీ రిజర్వేషన్లు శాశ్వతం కావు: జస్టిస్‌‌ వి.ఈశ్వరయ్య

బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తం..9వ షెడ్యూల్‌‌లో చేర్చకపోతే బీసీ రిజర్వేషన్లు శాశ్వతం కావు: జస్టిస్‌‌ వి.ఈశ్వరయ్య
  •     బీసీలకు రాజ్యాధికారం సాధించడమే మా లక్ష్యమని వెల్లడి
  •     24న ధర్నా చౌక్‌‌లో మహాధర్నాకు తరలిరావాలని పిలుపు

బషీర్ బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని జాతీయ బీసీ కమిషన్‌‌ మాజీ చైర్మన్‌‌, నేషనల్‌‌ బీసీ ఫెడరేషన్‌‌ చైర్మన్‌‌ జస్టిస్‌‌ వి.ఈశ్వరయ్య అన్నారు. ఈ నెల 24న ఇందిరా గాంధీ ధర్నా చౌక్‌‌లో జరగనున్న ‘బీసీ మహా ధర్నా’ సన్నాహక సమావేశం బుధవారం హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్‌‌ ప్రెస్ క్లబ్‌‌లో జరిగింది. 

దీనికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీలో బిల్లులు పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, ఆ బిల్లుకు అప్పట్లో అన్ని పార్టీలు మద్దతు తెలిపి తర్వాత మాట మార్చాయని మండిపడ్డారు.

 బీసీలకు న్యాయం చేయాలంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌‌లో చేర్చాలని, అదే శాశ్వత పరిష్కారమని చెప్పారు. బీసీలకు రాజకీయాధికారాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. అన్ని పార్టీల నేతలు స్వచ్ఛందంగా మహా ధర్నాలో పాల్గొని తమ వైఖరిని ప్రజల ముందు వెల్లడించాలన్నారు. 

9వ షెడ్యూల్‌‌లో చేర్చడం ఒక్కటే మార్గం: చిరంజీవులు

42 శాతం రిజర్వేషన్ల అంశం చట్టబద్ధత పొందాలంటే 9వ షెడ్యూల్‌‌లో చేర్చడం ఒక్కటే మార్గమని బీసీ ఇంటలెక్చువల్‌‌ ఫోరం చైర్మన్‌‌, మాజీ ఐఏఎస్‌‌ అధికారి టి.చిరంజీవులు అన్నారు. జీవోలు, చట్టాలు కోర్టుల్లో నిలవదని ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు. మార్చి 17న అసెంబ్లీలో బిల్లులు పాస్‌‌ చేసి కేంద్రానికి పంపినా, తర్వాత ప్రభుత్వం జీవో నం.9ని విడుదల చేసిందని గుర్తుచేశారు.

 రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్‌‌లో చేర్చేలా చూడాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌‌ డా.విశారదన్‌‌ మహారాజ్‌‌ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే పది రెట్లు పెద్దది అవుతుందన్నారు.

 కేంద్రం, రాష్ట్రం రెండూ బీసీల హక్కులను అడ్డుకుంటున్నాయని, వాటిపై ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్‌‌లో చేర్చించేందుకు ఐక్యంగా పోరాడతామని తెలిపారు. పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌‌ బీసీలపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. బీసీ ఉద్యమం ఇక రాజకీయంగా మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, కాంట్రాక్టులు, న్యాయ విభాగాల్లో కూడా రిజర్వేషన్లు అమలయ్యే వరకు సాగుతుందని స్పష్టం చేశారు. 

సంప్రదాయ బీసీ సంఘాల శకం ముగిసిందని, ఇప్పుడు శాస్త్రీయ బీసీ సంఘాల శకం ప్రారంభమైందని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు సింగం నాగేశ్వర్ గౌడ్, దామోదర్ గౌడ్, డాక్టర్ విజయభాస్కర్, గౌడ్ బైరి శేఖర్, చామకూర రాజు, ఎస్.దుర్గయ్య గౌడ్, రామ్ నరసింహ, రాచాల యుగేందర్ గౌడ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.