కాళేశ్వరం అధ్యయనానికి ప్రత్యేక కమిటీ వేసిన NDSA

కాళేశ్వరం అధ్యయనానికి  ప్రత్యేక కమిటీ వేసిన NDSA

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీని నియమించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. U.C. విద్యార్థి, R. పాటిల్, శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలను కమిటీ సభ్యులుగా నియమించింది. మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనుంది కమిటీ. వచ్చే నాలుగు నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్టు సమర్పించనుంది ఈ కమిటీ.

మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు.. నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ కోరింది. 


ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మూడు బ్యారేజీలపై కమిటీ వేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి.. కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్నామ్నాయాలను సిఫార్సు చేయాలని కమిటీకి సూచించింది.