జగిత్యాల హైవేకు ఎన్జీటీ అనుమతి

జగిత్యాల హైవేకు ఎన్జీటీ అనుమతి
  •     చత్తీస్‌గఢ్ లోని  జగ్దల్ పూర్ హైవేకు లింకు 
  •     నిర్మల్ నుంచి ఖానాపూర్  వరకు ఫారెస్ట్​ క్లియరెన్స్
  •     కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల కోసం 7 అండర్​పాస్​లు
  •     తొలగించే ప్రతి చెట్టుకు బదులు పది మొక్కలు నాటాలని రూల్

నిర్మల్ టౌన్, వెలుగు: మహారాష్ట్రలోని కల్యాణ్  నుంచి రాష్ట్రంలోని భైంసా, నిర్మల్, ఖానాపూర్ మీదుగా జగిత్యాల వరకు గల నేషనల్ హైవే నంబర్ 61 విస్తరణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు  విస్తరణ పనులు పూర్తయితే చత్తీస్‌గఢ్ లోని జగ్దల్ పూర్ వరకు గల నేషనల్ హైవే 63కు లింకేజీ ఏర్పడుతుంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్  రాష్ట్రాలు అనుసంధానమవుతాయి. నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు రోడ్డు పనులను  మొదటి దశ కింద ఇప్పటికే  చేపట్టినప్పటికీ అటవీశాఖ అనుమతులు జారీ చేయకపోవడం, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ  వ్యవహారంలో  జోక్యం చేసుకోవడంతో  మూడేళ్ల కింద పనులు నిలిచిపోయాయి. నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు రోడ్డుకిరువైపులా కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండడంతో టేకు చెట్ల తొలగింపు, మట్టి తవ్వకం లాంటి పనులకు అటవీ శాఖ అనుమతులు జారీ చేయలేదు. కవ్వాల్ అభయారణ్యంలో  టేకు చెట్ల తొలగింపుపై  కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీంతో ఎన్జీటీ ఈ  వ్యవహారంపై  జోక్యం చేసుకొని  పనులకు అనుమతులు నిరాకరించింది. నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 3 వేల టేకు చెట్ల తొలగింపును ఈ  విస్తరణ  పనుల్లో  ప్రతిపాదించారు. మొదట ఈ  చెట్ల తొలగింపు, అలాగే  వన్యప్రాణుల సంరక్షణ  విషయంలో ఎన్జీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటితోపాటు కేంద్రంలోని  మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ శాఖ సైతం రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ వేసింది. అయితే  కేంద్ర అటవీశాఖ, ఎన్జీటీ అనుమతులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ పనుల  కోసం  రూ. వంద కోట్లు కేటాయించడమే కాకుండా టెండర్ ప్రక్రియను సైతం పూర్తి  చేసింది. ఓ వైపు అనుమతుల ప్రక్రియను కొనసాగిస్తూనే  మరో వైపు ప్రైవేట్​భూముల్లో ప్రాథమిక౦గా పనులను చేపట్టారు. రాష్ట్ర  ప్రభుత్వం పలుసార్లు ఇక్కడి అటవీ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీ, చెన్నై లకు పంపి అనుమతుల కోసం ప్రయత్నించింది. ఎట్టకేలకు ఎన్జీటీ బృందం గత నెల నిర్మల్, ఖానాపూర్ హైవే రోడ్డును పరిశీలించి౦ది. ఆ తర్వాత ఎన్జీటీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్​మెంట్​ఫారెస్ట్ క్లైమేట్ ఛేంజ్ కు అనుమతుల  విషయమై  పలు  సిఫారసులు చేసింది. దీ౦తో ఎట్టకేలకు కేంద్ర అటవీ శాఖ ఇటీవలే అనుమతులను జారీ చేసింది.

ఎన్జీటీ సిఫారసులు కీలకం
ఈ హైవేకు  అనుమతులనిస్తూ  ఎన్జీటీ కఠిన నిబంధనలను విధించింది. నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న  3 వేల చెట్ల  తొలగింపును నిరాకరిస్తూ కేవలం 1,451 టేకు  చెట్ల  తొలగింపునకు మాత్రమే అనుమతించింది.  మిగతా చెట్లను తొలగించవద్దని ఆదేశించింది. అలాగే తొలగించే ప్రతి  చెట్టుకు బదులుగా పది మొక్కలను నాటాలంటూ సంబంధిత శాఖకు సూచించింది. కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని వన్యప్రాణులను  సంరక్షించేందుకు ఏడుచోట్ల ప్రత్యేకంగా అండర్ పాస్ లను  నిర్మించాలంటూ  ఆదేశించింది. అలాగే  పరిహారంగా 14 కోట్ల రూపాయలను  సంబంధిత ఆర్ అండ్ బి నేషనల్ హైవే శాఖ అటవీ శాఖకు చెల్లించాలని సూచించింది . 

పెరగనున్న వ్యయం
నిర్మల్ నుంచి జగిత్యాల వరకు నిర్మించాల్సి ఉన్న ఈ హైవే పనులను రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో  భాగంగా నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు, రెండో దశలో ఖానాపూర్ నుంచి జగిత్యాల వరకు పనులను  చేపట్టాలని నిర్ణయించారు. పనులు ఆలస్యం కావడం, కొత్తగా ఎన్జీటీ సిఫారసుల మేరకు ఏడు చోట్ల అండర్ పాస్ లు నిర్మించాల్సి ఉండడంతో పనుల అంచనా వ్యయం భారీగా పెరగనుంది. 
అనుమతులు మంజూరయ్యాయి. నిర్మల్ నుంచి జగిత్యాల వరకు నేషనల్ హైవే నంబర్ 61 పనులకు ఎన్జీటీ  సిఫారసులతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్  ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. మొదటి దశలో భాగంగా నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు  క్లియరెన్స్ లభించడంతో పనులు చేపట్టనున్నాం.  రెండో దశలో ఖానాపూర్ నుంచి జగిత్యాల వరకు రోడ్డు పనులు చేపడతాం. 
– సుభాష్, డీఈ, నేషనల్ హైవే, నిర్మల్