మంచికి రోజులు కావు భయ్యా ఇవి.. మహిళను వేధించొద్దు అన్నందుకు.. నేషనల్ లెవెల్ బాడీ బిల్డర్ను పొట్టన పెట్టుకున్నారు !

మంచికి రోజులు కావు భయ్యా ఇవి.. మహిళను వేధించొద్దు అన్నందుకు.. నేషనల్ లెవెల్ బాడీ బిల్డర్ను పొట్టన పెట్టుకున్నారు !

పది మంది చెడ్డ వాళ్ల మధ్య ఒకరు మంచి మాట చెబితే అది చెడ్డ మాటే అయిపోతుంది అంటే ఇదేనేమో. మంచి కోసం వెళ్లి మానవత్వం లేని క్రూరుల చేతుల్లో మృతి చెందాడు జాతీయ స్థాయి బాడీ బిల్డర్. నేషనల్ లెవెల్ లో పథకాలు సాధిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో మంచి భవిష్యత్తు ఉన్న బాడీబిల్డర్ కెరియర్.. అర్థంతరంగా ముగిసిపోయిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఇన్సిడెంట్.. దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళ్తే.. హర్యానా రోహతక్ జిల్లా హుమాయున్ పూర్ కు చెందిన 26 ఏళ్ల బాడీ బిల్డర్, పారా అథ్లెట్ రోహిత్ ధన్కర్ క్రూర మృగాల చేతిలో బలైపోయాడు. శుక్రవారం (నవంబర్ 28) రోహిత్ తన ఫ్రెండ్ జతిన్ తో కలిసి భివానిలో ఒక పెళ్లికి వెళ్లాడు. తిగదానా గ్రామంలో జరుగుతున్న బరాత్ లో కొంత మంది ఒక మహిళను వేధిస్తుండటం చూశారు. ఆమెను హరాష్ చేయొద్దని వారించడంతో అక్కడ కొంత తోపులాట జరిగింది. ఆ క్షణం ఆ గ్యాంగ్ అక్కణ్నుంచి వెళ్లిపోయింది. 

రైల్వే ట్రాక్ దగ్గర దారి కాచీ దాడి..

గొడవ తర్వాత రోహిత్, తన ఫ్రెండ్ జతిన్ తో కలిసి ఇంటికి బయలుదేరాడు. అయితే రైల్వే ట్రాక్ దగ్గర క్రాసింగ్ సమయంలో గేట్లు క్లోజయ్యాయి. ఆ సమయంలో.. దాదాపు 20 మంది మారణాయుధాలు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఆ సమయంలో జతిన్ తప్పించుకున్నాడు కానీ.. రోహిత్ తప్పించుకోలేకపోయాడు. 

బాడీలో ఒక్క భాగాన్ని కూడా వదల్లేదు:

దుండగులు అత్యంత క్రూరంగా దారుణంగా దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాడీలో ఒక్క పార్ట్ ను కూడా వదల కుండా కొట్టారు. గాయాలు లేని భాగం అంటూ లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఘటన తర్వాత స్థానిక ఆస్పత్రికి తరలించగా.. రోహతక్ లోని PGIMS కు రెఫర్ చేశారు డాక్టర్లు. రాత్రంతా బతికించేందుకు విశ్వప్రయత్నం చేసినప్పటికీ.. శనివారం రోహిత్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PGIMS ఆస్పత్రికి వెళ్లిన పోలీసులు.. పోస్ట్ మార్టం తర్వాత కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. హంతకులకు కఠిన విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మహిళ గౌరవం కోసం నిలబడిన రోహిత్.. తన జీవితాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది.. ఇది ప్యాన్డ్ మర్డర్ అని.. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

బాడీ బిల్డింగ్లో రోహిత్ రికార్డ్స్:

రోహిత్ ధన్కర్ మంచి బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రోహతక్ లోని జిమ్ ఖానా క్లబ్ లో శిక్షణ పొంది అనతికాలంలోనే మంచి అథ్లెట్ గా ఎదిగాడు. 2018 లో ఢిల్లీలో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇండియన్ పారా ఒలింపిక్ కమిటీ నిర్వహించిన ఈ పోటీలతో దేశ వ్యాప్తంగా రోహిత్ పేరు మార్మోగింది. 

కుడి కాలికి కొంత వైకల్యం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు తెచ్చాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో 2018 లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు చెప్పారు. అప్పటి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు రోహిత్ ను సన్మానించినట్లు చెప్పారు. అలాంటి బాడీ బిల్డర్.. వీధి మూకల చేత హత్యకు గురికావడం దారుణమని వాపోతున్నారు.